పోటీ చేసే స్థానంపై పవన్ కల్యాణ్ ఇంకా క్లారిటీకి రాలేదా..?
ఏపీలో ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఇప్పటికే అన్ని పార్టీలూ అభ్యర్థుల ప్రకటనల్లో బిజీబిజీగా ఉన్నాయి. కొంతమంది నేతలకు అధికారికంగా, మరికొందరికి అనధికారికంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేయడంతో వాళ్లంతా ప్రచారబరిలోకి దిగిపోయారు. కానీ జనసేనలో మాత్రం ఇంకా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నేతల సంగతి పక్కన పెడితే అధినేత కూడా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై ఇంకా క్లారిటీకి రానట్టు తెలుస్తోంది. గతంలో పోటీ చేసిన స్థానాల నుంచే బరిలోకి దిగుతారా.. లేకుంటే కొత్త సీటును ఎంచుకుంటారా… అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
గత ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ గాజువాక, భీమవరం స్థానాల నుంచి బరిలోకి దిగారు. అయితే రెండు చోట్లా ఓడిపోయారు. అప్పటి నుంచి ఆయన ఆ రెండు స్థానాలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. బహుశా అక్కడి నుంచి మళ్లీ పోటీ చేసే ఉద్దేశం పవన్ కల్యాణ్ కు లేదేమో అనుకున్నారంతా.! కచ్చితంగా గెలవాలి అనుకునే నేతలెవరైనా ఏదైనా సీటును ఎంచుకుని అక్కడ ముందు నుంచే వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంటారు. క్షేత్రస్థాయిలో కార్యకర్తలు, ప్రజలకు అందుబాటులో ఉంటూ పనులు చక్కబెట్టుకుంటూ ఉంటారు. మంగళగిరిలో గత ఎన్నికల్లో లోకేశ్ ఓడిపోయారు. అయినా బెదరకుండా మళ్లీ అక్కడి నుంచే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం అక్కడ ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు.
కానీ పవన్ కల్యాణ్ మాత్రం అలా చేయట్లేదు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు స్థానాలనూ ఆయన ఓన్ చేసుకోలేదు. ఓడిన తర్వాత వాటి జోలికి పోలేదు. ఇప్పుడు మళ్లీ ఎన్నికలు వచ్చేశాయి. మరి ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. ఉభయగోదావరి జిల్లాల నుంచి పోటీ చేయడం ఖాయమని చాలా మంది అనుకుంటున్నారు. గతంలో పిఠాపురం నుంచి పోటీ చేసే ఛాన్స్ ఉందన్నారు. ఆ తర్వాత కాకినాడ అన్నారు. ఇప్పుడు మళ్లీ భీమవరం అంటున్నారు. కానీ దేనిపైనా పార్టీ కానీ, పవన్ కల్యాణ్ కానీ అధికారికంగా క్లారిటీ ఇవ్వలేదు.
అయితే భీమవరం నుంచి పవన్ పోటీ చేసే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని స్థానిక నేతలు చెప్పుకుంటున్నారు. ఓడిన చోటే గెలిచి సత్తా చాటాలని జనసైనికులు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయడం వల్ల ఓడిపోయామని, ఇప్పుడు టీడీపీ, బీజేపీ కలిసి వెళ్తున్నాయి కాబట్టి కచ్చితంగా గెలుస్తామని వాళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అయితే వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాత్రం పవన్ పోటీ చేస్తే నాన్ లోకల్ ఫీలింగ్ తెచ్చి లబ్ది పొందాలనుకుంటున్నారు. అయితే పొత్తులో ఈ సీటు ఏ పార్టీకి దక్కుతుందనే దాన్ని బట్టి ఎవరు పోటీ చేస్తారనేదానిపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.













