పిఠాపురం పై పవన్ కసరత్తు.. ఈసారైనా ఫలితం దక్కేనా..?
వారాహి యాత్రలో పవన్ కళ్యాణ్ మాటల తూటాలు పేలుస్తూ ప్రత్యర్ధులపై విరుచుకుపడ్డారు. ఆ సమయంలో హలో ఏపీ..బై బై వైసీపీ అంటూ ఆయన చెప్పిన డైలాగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయింది. తిరిగి పవన్ కళ్యాణ్ నుంచి ఆ రేంజ్ పంచ్ డైలాగ్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారానికి సంబంధించిన డేట్లు ఖరారు అయ్యాయి. మార్చ్ 30 నుంచి ఏప్రిల్ 12 వరకు తొలి విడత ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. ఈసారి పవన్ తాను స్వయంగా పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం పై ఫుల్ ఫోకస్ పెట్టబోతున్నారు. మార్చి 30 , 31, ఏప్రిల్ 1, 2 మరియు 9 తారీకులలో పిఠాపురం నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తారు. ఈ షెడ్యూల్లో మిగిలిన రోజుల్లో తెనాలి, నెల్లిమర్ల, అనకాపల్లి, ఎలమంచిలి,పెందుర్తి వంటి ప్రాంతాలలో పర్యటిస్తారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులతో పాటు భారీ సంఖ్యలో టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తమ మద్దతు తెలియపరచబోతున్నారు. 2019 ఎన్నికల్లో గాజువాక, భీమవరం నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన పవన్ ఓటమి చవి చూశారు.. అందుకే ఈసారి పిఠాపురంలో ఎలాగైనా తన జెండా పాతడానికి పవన్ భారీ ఎత్తున ప్రయత్నిస్తున్నారు.













