రైతు కన్నీరు దేశానికి మంచిదికాదు: పవన్
పెట్టుబడుల కోసమంటూ విదేశీ కార్పొరేట్ కంపెనీలపై చూపించే శ్రద్ధ దేశానికి అన్నంపెట్టే రైతులపై చూపకపోవడం వల్లే వారంతా రోడ్డెక్కాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మిర్చి రైతుల ఆందోళనే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణగా నిలుస్తుందని ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఆరుగాలం శ్రమించి పండించే రైతు కన్నీరు పెట్టడం దేశానికి శ్రేయస్కరం కాదన్నారు. ఈ సీజన్లో మిర్చి పంట ఎంత విస్తీర్ణంలో ఎంత వేయాలో రైతులకు ముందుగా తెలియజేయడంలో వ్యవసాయశాఖ విఫలమైతే, పండిన పంటకు గిట్టుబాటు ధర లభించేటట్లు చేయలేకపోవడం మార్కెటింగ్ శాఖ వైఫల్యంగా తమ పార్టీ భావిస్తోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు రైతుల పట్ల, వారి సమస్యల పట్ల చిన్నచూపు మాని క్రియాశీలకంగా పనిచేయాలని కోరారు. క్వింటాల్ మిర్చికి రూ.11వేల చొప్పున రైతుకు గిట్టుబాటుధర ఇవ్వాలని కోరారు. మార్కెట్లో ధరకు, గిట్టుబాటు ధరకు మధ్య వ్యత్యాసాన్ని ప్రభుత్వం చెల్లించాలని పవన్ డిమాండ్ చేశారు.













