సీనియర్ పాత్రికేయుల మరణంపై పవన్ కల్యాణ్ సంతాపం
తెలుగు పత్రికా రంగంలో సీనియర్ పాత్రికేయులు అయిన జి.ఎస్.వరదాచారి, కె.ఎల్.రెడ్డి మృతిపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. తెలుగు జర్నలిజంలో విశేష అనుభవం ఉన్న ఈ పాత్రికేయుల మరణం చాలా బాధాకరమని ఈ సందర్భంగా పవన్ అన్నారు. సమాజం పట్ల ఎంతో బాధ్యతతో పాత్రికేయ వృత్తిలో అడుగుపెట్టి, ఎంతో నిబద్ధతతో వారు సమాజానికి చేసిన సేవలు మరువలేనివని పేర్కొన్నారు. తెలుగు భాషపై వారికున్న పట్టు, సమాజంలో మార్పు తేవాలనే కసి అమొఘమని.. వార్తా రచనతో ప్రజలను చైతన్యం చేయాలని అనుకునే ఎందరో నేటి తరం పాత్రికేయులకు వారిద్దరు స్ఫూర్తినిచ్చారని పవన్ చెప్పారు. ‘తెలంగాణ అక్షర యోధుడు’గా గుర్తింపు పొందిన కె.ఎల్.రెడ్డి 1969 నాటి తెలంగాణ ఉద్యమ కాలంలోనే తన అభిప్రాయాలను వార్తల ద్వారా తేటతెల్లం చేశారు. తెలుగు పత్రికల్లో భాషపై ఈతరం పాత్రికేయులకు ఉపయోగపడేలా పుస్తకాన్ని కూడా ప్రచురించారు. తెలుగు పాత్రికేయ రంగానికి ఈ సీనియర్ పాత్రికేయులు చేసిన సేవలను యువ జర్నలిస్టులు అందరూ గుర్తుంచుకోవాలని పవన్ పేర్కొన్నారు.













