Pawan Kalyan: తనపై తానే విమర్శలు చేసుకుంటున్న పవన్…!
జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan).. ఈ మధ్యకాలంలో చేస్తున్న కామెంట్స్ సంచలమవుతున్నాయి. గతంలో మాట్లాడే మాటలకు ప్రస్తుతం మాట్లాడుతున్న మాటలకు తేడా ఉండటంతో.. ఆయనను పలువురు ట్రోల్ చేసే పరిస్థితి నెలకొంది. తాజాగా జనసేన ఆవిర్భావ సభలో.. పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు కాస్త సంచలనమనే చెప్పాలి. ముఖ్యంగా హిందీ భాష విషయంలో పవన్ కళ్యాణ్ జాతీయస్థాయిలో ట్రోల్ అవుతున్నారు.
గతంలో భారతీయ జనతా పార్టీ(BJP) హిందుత్వ పార్టీ కాదని.. హిందీ పార్టీ అని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాది రాష్ట్రాలపై ఉత్తరాది పార్టీలు వివక్ష చూపుతున్నాయంటూ కూడా పవన్ కళ్యాణ్ పలు సందర్భాల్లో వ్యాఖ్యలు చేసారు. ఇక ఇప్పుడు తమిళనాడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా హిందీ విషయంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేపుతున్నాయి. హిందీ భాష విషయంలో కావాలని రాద్ధాంతం చేస్తున్నారని.. తమిళ సినిమాలను హిందీలో డబ్బింగ్ చేయవద్దని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు.
కావాలనే హిందీని, సంస్కృతాన్ని అవహేళన చేసే ప్రయత్నం జరుగుతోందంటూ.. హిందీ భాషకు మద్దతుగా పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇక తనపై తానే విమర్శలు చేసుకుంటున్నారు అంటూ పవన్ కళ్యాణ్ పై కొంతమంది సెటైర్లు వేస్తున్నారు. అటు జనసేన కీలక నేత నాగబాబు చేసిన వ్యాఖ్యలపై కూడా దుమారం రేగింది. అధికారంలో ఉన్నప్పుడు ఒకరకంగా.. అధికారం కోసం ఒక రకంగా మాట్లాడటం కరెక్ట్ కాదని మరికొంతమంది సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ టార్గెట్ గా విమర్శలు చేయడం మొదలు పెట్టారు.
హిందీ భాష విషయంలో పవన్ కళ్యాణ్ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విమర్శించారు. ఈ వ్యాఖ్యలు అనవసరంగా పవన్ కళ్యాణ్ పరువును రెండు తెలుగు రాష్ట్రాల్లో తీస్తాయని.. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో హిందీ ఆధిపత్యం పై ఆగ్రహం ఉందని.. ఇలాంటి విషయాల్లో పవన్ కళ్యాణ్ ఆచితూచి స్పందిస్తే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు.













