వాలంటీర్లపై తగ్గేదే లేదంటున్న పవన్ కల్యాణ్..!! మరోసారి ఘాటు వ్యాఖ్యలు..!!
ఆంధ్రప్రదేశ్ లో వాలంటీర్లపై రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటోంది. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వీళ్లే వారధులని.. వీళ్లు వచ్చాకే పాలనా వ్యవస్థ సజావుగా సాగుతోందని ప్రకటించింది. ప్రజలెవరూ తమ ఇళ్లు దాటి బయటకు రావాల్సిన అవసరం లేకుండా.. వాలంటీర్లు ఇంటి వద్దకే వెళ్లి అన్ని సేవలు చేస్తున్నారని ఘనంగా చెప్తున్నారు. అయితే ఇటీవలికాలంలో వాలంటీర్ వ్యవస్థపై అనేక ఆరోపణలు వస్తున్నాయి. కొంతమంది వాలంటీర్లు అకృత్యాలకు పాల్పడుతున్నారు. దీంతో ఈ వ్యవస్థపై పోరాటం మొదలు పెట్టారు జనసేన అధినేత పవన్ కల్యాణ్.
వాలంటీర్ వ్యవస్థను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటూ ఉంటే జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రంద నిపై యుద్ధం ప్రకటించారు. వాలంటీర్ల వల్ల అనేక అక్రమాలు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే ఆయన వాలంటీర్లు సేకరిస్తున్న డేటా పక్కదారి పడ్తోందని.. వాళ్లకు ఏమి అర్హత ఉందని డేటా సేకరిస్తున్నారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. వాళ్లు ఆ డేటాను తీసుకెళ్లి వైసీపీ నేతలకు ఇస్తున్నారని.. దాన్ని అడ్డు పెట్టుకుని వాళ్లు దారుణాలు చేస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో మహిళలు పెద్ద ఎత్తున మిస్ కావడానికి ఇదే కారణమని తీవ్ర విమర్శలు చేశారు. దీనిపై వాలంటీర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం కూడా పవన్ కల్యాణ్ పై కేసు నమోదు చేసింది.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం వాలంటీర్లపై వెనక్కు తగ్గట్లేదు. తాజాగా విశాఖ పర్యటనలో ఉన్న ఆయన మరోసారి వాలంటీర్లపై విరుచుకు పడ్డారు. వాలంటీర్లు దండుపాళ్యం బ్యాచ్ కన్నా డేంజర్ అన్నారు. ఇళ్లలోకి చొరబడి గొంతులు కోస్తున్నారని.. ఒంటరి మహిళలను టార్గెట్ చేస్తున్నారని విమర్శించారు. అసలు వాలంటీర్లను నియమించుకునే ముందు పోలీస్ వెరిఫికేషన్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ దృష్టికీ తీసుకెళ్తానన్నారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు తమ కార్యకర్తలనే వాలంటీర్లుగా నియమించారని.. వాళ్లు చెప్పినట్లు వీళ్లు ఆడుతున్నారని పవన్ ఎప్పటి నుంచో చెప్తున్నారు. ఇప్పుడు మరోసారి అదే మాట చెప్పారు.
వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగులు కారు. వాళ్లను తాత్కాలిక ప్రాతిపదికన ప్రభుత్వం నియమించింది. అయితే స్థానికంగా ఉన్న కుటుంబాల సమస్త సమాచారం వాళ్ల దగ్గరున్న ట్యాబ్స్ లో నిక్షిప్తమై ఉంటుంది. దాన్ని స్థానిక వైసీపీ నేతలకు ఇచ్చి వాలంటీర్లు డేటాను దుర్వినియోగం చేస్తున్నారనేది పవన్ కల్యాణ్ ఆరోపణ. వాలంటీర్లు ఏదైనా తప్పు చేస్తే వాళ్లపై చర్య తీసుకునే అధికారం ఉందా.. అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థ దుర్వినియోగంపై పవన్ కల్యాణ్ ఎందాకైనా వెళ్లి పోరాడతానని చెప్పారు.













