పొత్తులపై సంచలన ప్రకటన చేసిన పవన్ కల్యాణ్!
పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తొలిసారి నోరు విప్పారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పొత్తులు పెట్టుకుంటామని స్పష్టం చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటును చీలనివ్వబోమని, కచ్చితంగా ఆ పార్టీని గద్దె దించుతామని తేల్చి చెప్పారు. రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే పొత్తుల గురించి ఆలోచిస్తానని వెల్లడించారు. అకాల వర్ష ప్రభావిత ప్రాంతాల్లో రైతులను పరామర్శించిన అనంతరం మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయంలో పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు.
కలిసొచ్చే పార్టీలతో వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పొత్తు పెట్టుకోబుతున్నట్టు పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. తమతో పాటు కలసి రావాలని ఇతర పార్టీలను కూడా కలిసి ఒప్పిస్తామని చెప్పారు. ఢిల్లీ వెళ్లినప్పుడు కూడా పొత్తులపై మాట్లాడినట్టు తెలిపారు. ఇది కచ్చితంగా బీజేపీని ఉద్దేశించే మాట్లాడి ఉండొచ్చని భావిస్తున్నారు. పొత్తులనేవి కులానికి సంబంధించినవి కావని, కచ్చితంగా రాష్ట్ర శ్రేయస్సును దృష్టిలో పెట్టుకునే పొత్తులు పెట్టుకుంటామని తేల్చి చెప్పారు. ఎర్లీ ఎలక్షన్స్ అని చెప్తున్నారని.. అదే జరిగితే జూన్ నుంచే పూర్తిస్థాయిలో ఇక్కడే మకాం వేస్తానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
2019 నుంచే పూర్తి స్థాయి రాజకీయాల్లో ఉన్నామన్న పవన్ కల్యాణ్.. ఆ ఎన్నికల్లో కొన్ని సీట్లయినా గెలిచి ఉంటే ఇప్పుడు బలంగా ఉండేవాళ్లమని అభిప్రాయపడ్డారు. 30-40 స్థానాలు వచ్చింటే ఇప్పుడు కర్నాటకలో జేడీఎస్ లాగా ఉండేవాళ్లమన్నారు. అయితే గతంతో పోల్చితే తాము బాగా బలపడినట్లు చెప్పారు పవన్ కల్యాణ్. కొన్ని చోట్ల 30 శాతం వరకూ తమకు పట్టుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా సరాసరి తీసుకుంటే కచ్చితంగా 18-19శాతం ఉండొచ్చన్నారు. మా బలాన్ని బట్టే సీట్లు అడుగుతామని, తమ గౌరవానికి భంగం కలగకుంటే ముందుకు వెళ్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లాంటి పార్టీలు కూడా పొత్తులతోనే బలపడిన విషయాన్ని పవన్ కల్యాణ్ గుర్తు చేశారు.
సీఎం సీటు పైనా పవన్ కల్యాణ్ స్పందించారు. కొంతమంది సీఎం సీటు అడగాలని కోరుతున్నారని.. అయితే ఏదీ తాను ఆశించి తీసుకోనన్నారు. తనకు ఆ హోదా ఉన్నప్పుడు, తన బలం ఆ స్థాయికి చేరినప్పుడు పదవి తీసుకోవాలనేది తన ఉద్దేశమన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం పార్టీ పెట్టలేదని మరోసారి చెప్పారు. కండిషన్స్ పెడితే రాజకీయాలు కష్టమన్నారు. వైసీపీ నుంచి అధికారం తీసేసుకుని ప్రజలకు అప్పగించాలన్నదే ఇప్పుడు తమ ముందున్న లక్ష్యమన్నారు. సినిమాల్లో సూపర్ స్టార్ హోదా తెచ్చుకున్నానన్నారు పవన్ కల్యాణ్.













