Pawan Kalyan: భారత సైనికులకు పవన్ కళ్యాణ్ భరోసా..గ్రామీణ ప్రాంతాల్లో ఆస్తి పన్ను మినహాయింపు..

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తీసుకున్న ప్రతి నిర్ణయం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. తాజాగా దేశం ఎదుర్కొంటున్న పరిస్థుల్లో, భారత సైన్యంలో (Indian army) పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్ సైనికులకు, వారి కుటుంబాలకు భరోసా కలిగించేలా పవన్ కీలకంగా వ్యవహరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నివసించే సైనికులు, వారి కుటుంబాలకు ఆస్తి పన్ను (Property tax) నుంచి పూర్తిగా మినహాయింపు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ ప్రకటనతోనే ఆగిపోకుండా, శుక్రవారం రోజునే సంబంధిత ప్రభుత్వ ఉత్తర్వులను కూడా విడుదల చేయించారు.
దేశ రక్షణ కోసం తన ప్రాణాలను సైతం తృణంగా అర్పించే భారత సైనికుల సేవలు మాటల్లో చెప్పలేనివి. వారు చేసే త్యాగాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పలు రకాల ప్రయోజనాలను అందిస్తూ ఉంటుంది. ప్రస్తుతం పనిచేస్తున్న సైనికులకే కాకుండా, ఉద్యోగ విరమణ పొందిన మాజీ సైనికులకు కూడా పింఛన్( Pension) , ఉపాధి అవకాశాలు, కుటుంబం కోసం వివిధ పథకాల ద్వారా మద్దతు అందుతుంది. యుద్ధాల్లో ప్రాణాలు కోల్పోయిన వీరుల కుటుంబాలకు అన్ని విధాలుగా రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం ముందుంటోంది.
ఈ తరహాలోనే రాష్ట్రస్థాయిలో కూడా మరింత మద్దతుగా ఉండే విధంగా పవన్ కళ్యాణ్ ఆలోచించారు. ఎప్పుడూ దేశం కోసం నిలబడే సైనిక కుటుంబాలకు ఎంత సహాయం చేసినా తక్కువే అన్న దృక్పథంతో, స్థిరాస్తి పన్ను పూర్తిగా మినహాయింపు ఇచ్చారు. ఇది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సైనిక కుటుంబాలకు తక్షణ ప్రయోజనం కలిగించనున్నది.
పంచాయతీరాజ్ (Panchayati Raj) మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ద్వారా విడుదలైన జీవో నెంబర్ 49 ప్రకారం, ఈ మినహాయింపు కేవలం ప్రస్తుత సైనికులకు మాత్రమే కాకుండా, ఇప్పటికే పదవీవిరమణ పొందిన సైనికులు, వారి కుటుంబాలు, వీర మృతుల కుటుంబాలకు కూడా వర్తిస్తుంది. ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ఈ నిబంధనలు అమలులోకి వస్తాయని స్పష్టంగా పేర్కొన్నారు. గతంలో ఉన్న విధానాలతో పోలిస్తే, ఇప్పటి ఉత్తర్వుల ద్వారా లబ్ధి మరింత విస్తృతమైందని ప్రభుత్వం స్పష్టం చేసింది. పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్రంలోని సైనిక కుటుంబాలకు ఒక గొప్ప ఊరటగా నిలిచింది.సైనికుల సేవలను ఈ గౌరవించే చర్య..ఇతర రాష్ట్రాలకు కూడా ఆదర్శంగా నిలవనుంది.