Pawan Kalyan: దటీజ్ పవన్..! వేదిక దిగకముందే సమస్యకు పరిష్కారం..!!
రాజకీయాల్లో నాయకులు హామీలు ఇవ్వడం సర్వసాధారణం. వినతులు స్వీకరించడం, పరిశీలిస్తాం అని చెప్పడం నిత్యకృత్యం. కానీ, ఒక సమస్య విన్న వెంటనే, అది కూడా ఒక సామాన్య కానిస్టేబుల్ నుంచి వచ్చిన విజ్ఞప్తిని వేదిక మీద ఉండగానే పరిష్కరించడం అనేది అరుదైన విషయం. మంగళగిరిలో జరిగిన కానిస్టేబుల్ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ స్పందించిన తీరు, తీసుకున్న నిర్ణయం.. “అధికారం అంటే ఆధిపత్యం కాదు, బాధ్యత” అని చాటిచెప్పింది. ‘దటీజ్ పవన్’ అని మరోసారి నిరూపించింది.
మంగళగిరిలో కానిస్టేబుల్ గా ఎన్నికైన లాకే బాబూరావు అనే వ్యక్తి ధైర్యం చేసి, వేదికపై ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని తన గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరారు. అది అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లాలోని మారుమూల గ్రామం. ఆ వినతిలోని ఆవేదనను గుర్తించిన ముఖ్యమంత్రి, వెంటనే ఆ బాధ్యతను పక్కనే ఉన్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దృష్టికి తెచ్చారు.
మామూలుగా అయితే “ఫైల్ పంపించు, చూద్దాం” అనే జవాబు వస్తుంది. కానీ అక్కడ ఉన్నది పవన్ కల్యాణ్. వెంటనే అధికారులను ఆదేశించారు. ఆ సభ ముగిసేలోపే, అంటే కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే తెనుములబండ నుంచి ఎలుగురాతిబండ వరకు 2 కిలోమీటర్ల బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.2 కోట్ల నిధులను మంజూరు చేస్తూ పరిపాలనా అనుమతులు జారీ చేశారు. ప్రభుత్వ యంత్రాంగం ఇంత వేగంగా పనిచేయగలదా? అని ఆశ్చర్యపోయేలా చేసిన ఘటన ఇది.
ఇక్కడ మనం గమనించాల్సింది పరిపాలనా వేగాన్ని మాత్రమే కాదు, ఆ నిర్ణయం వెనుక ఉన్న మానవీయ కోణాన్ని. పవన్ కల్యాణ్ స్పందనలో ఒక ఎమోషన్ ఉంది. ఒక సామాన్యుడు, అందునా వ్యవస్థలో ఇప్పుడే అడుగుపెడుతున్న ఒక కానిస్టేబుల్, తన స్వార్థం కోసం కాకుండా తన ఊరి బాగు కోసం అడిగినప్పుడు, దానికి దన్నుగా నిలవాల్సిన బాధ్యత పాలకుడిపై ఉందని పవన్ నమ్మారు. అందుకే బ్యూరోక్రసీ అడ్డంకులను పక్కనపెట్టి, మానవత్వానికి పెద్దపీట వేశారు.
ఈ సంఘటనను కేవలం ఒక ప్రభుత్వ నిర్ణయంగా చూడలేం. ఇది పవన్ కల్యాణ్ వ్యక్తిత్వానికి నిలువుటద్దం. అధికారం లేనప్పుడు, చేతిలో ప్రభుత్వ ఖజానా లేనప్పుడే.. కౌలు రైతులు చనిపోతే వారి కుటుంబాలకు తన సొంత కష్టార్జితం నుంచి కోట్లాది రూపాయలు పంచి ఆదుకున్న చరిత్ర ఆయనది. సైనికుల సంక్షేమానికి విరాళాలు ఇవ్వాలన్నా, వరద బాధితులకు అండగా నిలవాలన్నా పవన్ ఎప్పుడూ వెనుకాడలేదు. “నా దగ్గర అధికారం లేనప్పుడే ప్రజలకు సాయం చేశాను, ఇప్పుడు ప్రజలు అధికారం ఇచ్చారు, ఇక ఎంతటి అద్భుతాలు చేయగలను?” అని పవన్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చారు. సొంత డబ్బుతోనే అంత దాతృత్వం చూపిన మనిషి, ప్రభుత్వ ఖజానా చేతిలో ఉన్నప్పుడు అది పేదవాడి అవసరాలకు ఖర్చు కాకపోతే ఇంకెందుకు? అనే ఆవేదన, ఆవేశం ఆయన నిర్ణయంలో కనిపించాయి.
ఈ ఘటన ఏపీ రాజకీయాల్లో, పాలనా వ్యవహారాల్లో వస్తున్న మార్పును సూచిస్తోంది. ఫైళ్లు నెలల తరబడి పెండింగ్లో ఉండే సంస్కృతికి ఇది చెంపపెట్టు. సంకల్పం ఉంటే నిబంధనలు అడ్డురావని పవన్ నిరూపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అనుభవం, ప్రజలపట్ల పవన్ కల్యాణ్ ఆవేశం కలిస్తే ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పడానికి ఇది ఉదాహరణ. “మా సమస్యలు వినేవారున్నారు” అనే భరోసాను సామాన్యుల్లో కల్పించడంలో ఈ ఘటన సఫలమైంది.
పవన్ కల్యాణ్ ఆ రోజు వేదికపై సంతకం చేసింది కేవలం ఒక రోడ్డు మంజూరు పత్రం మీద మాత్రమే కాదు, “ప్రజా సేవ” అనే పదానికి ఉన్న నిజమైన అర్థం మీద. మారుమూల గిరిజన గూడేనికి రోడ్డు వేయడం ద్వారా, పాలనను అట్టడుగు వర్గాల ముంగిట నిలిపారు. నిజంగా.. దటీజ్ పవన్!






