Pawan Kalyan: జనం మధ్యకు జనసేనాని..జిల్లాల వారీగా పవన్ పర్యటనలకు సిద్ధం..

జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడు కొత్త నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాదిన్నర పూర్తవుతోంది. ఇప్పటి వరకు తన శాఖల పనుల్లో పూర్తిగా నిమగ్నమై ఉన్న పవన్ కళ్యాణ్, ఇప్పుడు ప్రజల మధ్యకి వెళ్లే సమయం వచ్చిందని భావించారు. ఆయన వద్ద ఆరు శాఖలు ఉండటంతో గత కొన్ని నెలలుగా వాటిపై దృష్టి సారించి, వాటి పనితీరును బలోపేతం చేశారు. అంతేకాక, తాను కమిట్ అయిన సినిమా ప్రాజెక్టులు కూడా పూర్తిచేయడంతో ఇప్పుడు పూర్తిగా ప్రజా కార్యక్రమాలపై దృష్టిపెట్టాలని నిర్ణయించారు.
ఇప్పటికే పవన్ కళ్యాణ్ జిల్లాల వారీగా పర్యటనల ప్రణాళికను సిద్ధం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజల మధ్య ఉండటం ఎంతో అవసరమని ఆయన భావిస్తున్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ప్రజల సమస్యలు నేరుగా విని వెంటనే పరిష్కారం చూపగల అవకాశం అధికారంలో ఉన్నప్పుడు ఎక్కువగా ఉంటుంది. ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకోవడం ద్వారానే ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు ఎంతవరకు ఫలిస్తున్నాయో కూడా తెలుసుకోవచ్చని పవన్ అభిప్రాయం.
తొలిపర్యటనను పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం (Parvathipuram Manyam) జిల్లాలో ప్రారంభించబోతున్నారు. ఇటీవల అక్కడి కురుపాం (Kurupam) నియోజకవర్గంలోని గురుకుల పాఠశాలలో పలువురు విద్యార్థినులు అనారోగ్యానికి గురయ్యారు. ఈ ఘటనను పవన్ కళ్యాణ్ సీరియస్‌గా తీసుకుని అధికారులతో మాట్లాడి, విద్యార్థినుల పరిస్థితిపై సమాచారం సేకరించారు. త్వరలో అక్కడికి వెళ్లి వారిని పరామర్శించి, అవసరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఉత్తరాంధ్ర (Uttarandhra) తో మొదలుపెట్టి, రాష్ట్రంలోని అన్ని జిల్లాలను పవన్ కళ్యాణ్ వరుసగా సందర్శించాలని నిర్ణయించారు. ఈ పర్యటనల్లో ఆయన ఉమ్మడి ప్రకాశం (Prakasam) జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు (S.P.S. Nellore) జిల్లా, కాకినాడ (Kakinada) జిల్లా, తన సొంత నియోజకవర్గం పిఠాపురం (Pithapuram)తో పాటు రాజోలు (Rajolu) ప్రాంతాలను కూడా కవర్ చేయనున్నారు. ఈ పర్యటనల్లో ఆయన కేవలం అధికార కార్యక్రమాలకే పరిమితం కాకుండా, జనసేన పార్టీ నేతలు, నియోజకవర్గ ఇంచార్జీలు, వీర మహిళలు, స్థానిక నాయకులతో కూడా భేటీ అవుతారు. పార్టీ బలోపేతం కోసం, భవిష్యత్తు వ్యూహాలపై చర్చలు జరుగుతాయని సమాచారం.
పవన్ కళ్యాణ్ రాబోయే మూడున్నరేళ్లలో ప్రభుత్వ కార్యక్రమాలను పర్యవేక్షిస్తూ, ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటూ, పార్టీని మరింత బలపరచే దిశగా ముందుకు వెళ్ళాలని నిర్ణయించారు. అధికారిక పర్యటనలతో పాటు రాజకీయ సమావేశాలు కూడా కొనసాగుతాయని, పార్టీని మరింతగా ప్రజలకు దగ్గర చేయాలన్నదే ఆయన లక్ష్యమని తెలుస్తోంది. కురుపాం ఘటనను పర్సనల్‌గా ఫాలోఅప్ చేసిన ఆయన త్వరలో అక్కడికి వెళ్లి విద్యార్థినులను కలుస్తానని చెప్పినట్లు సమాచారం. మొత్తానికి పవన్ కళ్యాణ్ జిల్లా పర్యటనలు ప్రారంభమైతే రాష్ట్ర రాజకీయ వాతావరణంలో కొత్త చైతన్యం మొదలవుతుందని, ప్రజలతో నేరుగా కలిసే ఈ నిర్ణయం ఆయనకు రాజకీయంగా పెద్ద మైలురాయిగా మారనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.