ఇద్దరూ ఇద్దరే..
ఓడిన చోటే గెలవాలని ప్రయత్నిస్తున్నారు. ప్రజల్లో తమ పట్ల పెరుగుతున్న ఆదరణను ఓట్ల రూపంలో మార్చుకోవాలని భావిస్తున్నారు. వారిలో ఒకరు జనసేనాని పవన్ కల్యాణ్ కాగా.. మరొకరు నారా లోకేష్. ఇటీవలే గాజువాకలో పర్యటించిన పవన్ కల్యాణ్… తాను పోటీ చేయబోయే నియోజకవర్గం తాను ఓడిన గాజువాకే అని స్పష్టం చేశారు. ఇక మంగళగిరిలో ఓడిన నారాలోకేష్ కూడా తాను పోటీ చేయనున్న నియోజకవర్గం .. మంగళగిరి అని తేల్చేశారు. దీంతో తమ నియోజకవర్గాల్లో గెల్చి, సత్తా చాటాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారీ ఇద్దరు నేతలు.
2019 ఎన్నికల్లో గాజువాక నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేశారు. దాదాపు 16 వేల ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. దాదాపు నాలుగేళ్ల తర్వాత ఆయన తాను ఓటమి పాలైన నియోజకవర్గంలో ఇటీవల పర్యటించారు. ఈ సందర్భంగా ఆయనకు అక్కడ ఘన స్వాగతం లభించింది. ఓడినా గాజువాక తన నియోజకవర్గం అని సగర్వంగా ప్రటించారు. అక్కడి ప్రజలు కూడా ఆయనకు నీరాజనాలు పలికారు. దీంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ జనసేన జెండా ఎగురుతుందని ఆయన ప్రకటించారు.
మరోవైపున టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర మంగళవారం మంగళగిరిలోకి అడుగు పెట్టింది. అక్కడ ఆయనకు అభిమానుల నుంచి అపూర్వ స్వాగతం ఎదురైంది. పైగా వందల సంఖ్యలో వైసీపీ, ఇతర పార్టీల కార్యకర్తలు టీడీపీలో చేరడం కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో లోకేశ్ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయినా నిరుత్సాహ పడకుండా స్థానికంగా పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకుని పలు సామాజిక కార్యకమ్రాల ద్వారా ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ప్రభుత్వ ప్రజావ్యతిరేకత, స్థానికంగా ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కలిసి.. తాము గ్యారంటీగా గట్టెక్కుతామని ఇద్దరు నేతలు భావిస్తున్నారు. దీనికి తోడు ఓటమిభారం తీవ్రంగా కలిచివేయడంతో..దాన్నుంచి బయటపడి, ప్రత్యర్థులకు గట్టిగా బదులిచ్చేందుకు ఈ నియోజకవర్గాల్లో గెలవడమే లక్ష్యంగా ఇద్దరు నేతలు శక్తియుక్తులన్నీ ఒడ్డి పోరాడుతున్నారు.
ఎక్కడ పోగొట్టుకున్నామో.. అక్కడే వెతుక్కోవాలనేది తెలుగు సామెత. ఈ ఇద్దరూ పార్టీలు వేరైనా తాము ఓడిన నియోజకవర్గాల్లో ఈ వారంలో పర్యటన చేపట్టారు. గాజువాక జన సైనికులతో హోరెత్తగా.. మంగళగిరి నారా లోకేష్ అభిమానులతో నిండిపోయింది. ఆ అభిమానం ఓట్ల రూపంలోకి మారతాయో లేదో చూడాలి మరి..?













