అమరావతిలో పవన్ కల్యాణ్ నివాసం
జనసేన అధినేత పనన్కల్యాణ్ రాజధాని అమరావతిలో నివాసమేర్పరుచుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం కాజా సమీపంలో సొంత ఇంటి నిర్మాణానికి సోమవారం ఉదయం ఆయన భూమిపూజ చేశారు. మురగన్ హోటల్ రోడ్డులోని సాహితీ వెంచర్లో ఈ ఇంటి నిర్మాణం చేపట్టనున్నారు. ఈ పూజా కార్యక్రమానికి జనసేనాని సతీసమేతంగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సన్నిహితులను మాత్రమే ఆహ్వానించారు. పవన్ కల్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాలపై దృష్టిపెట్టారు. ఇప్పటి వరకు హైదరాబాద్ నుంచి రాజకీయాలు చేస్తున్న ఆయన ఇక అమరావతి కేంద్రంగా పార్టీ కార్యకలాపాలు సాగించనున్నారు.
పవన్ కల్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై దృష్టి సారించనున్నారు. అందుకే హైదరాబాద్ నుంచి కాకుండా సొంత రాష్ట్రం నుంచే తన కార్యక్రమాలు సాగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే పార్ట ఆవిర్భావ దినోత్సవ సభను కూడా గుంటూరులో నిర్వహించనున్నారు. ఇప్పటికే పార్టీ రాష్ట్ర కార్యాలయం కోసం మంగళగిరి సమీపంలో స్థలాన్ని లీజుకు తీసుకున్నారు. ఇప్పుడు శాశ్వత నివాసాన్ని కూడా ఇక్కడే ఏర్పాటు చేసుకోనున్నారు.













