ప్రజల కోసం పోరాడితే పోలీసు నోటీసులా?.. పవన్ కల్యాణ్ ఆవేదన
విశాఖ పట్టణంలో భారీ ర్యాలీ ఏర్పాటు చేసినందుకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు ఏపీ పోలీసులు నోటీసులు అందజేశారు. సెక్షన్ 30 అమల్లో ఉండగా ఈ ర్యాలీ నిర్వహించారంటూ విశాఖ తూర్పు ఏసీపీ హర్షిత చంద్ర.. జనసేనానికి నోటీసులు ఇచ్చారు. ఈ ర్యాలీలో 500 మందికిపైగా ప్రజలు పాల్గొన్నట్లు నోటీసుల్లో పోలీసులు పేర్కొన్నారు. ఈ నోటీసులపై పవన్ కల్యాణ్ స్పందిస్తూ.. ప్రజల కోసం పోరాడితే పోలీసులు నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాము విశాఖ రావడానికి ముందే గొడవ జరిగిందని, అయినా సరే తాము వచ్చి రెచ్చగొట్టడం వల్లే జరిగినట్లు పోలీసులు నోటీసులు ఇచ్చారని పవన్ ఆరోపించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా బెదరడం జరగదని, చివరకు జైలుకు వెళ్లేందుకైనా తానుసిద్ధమని ఆయన అన్నారు. ఉత్తరాంధ్రలో జరుగుతున్న దోపిడీని చూపిస్తామనే భయంతోనే ఇక్కడ డ్రోన్లను నిషేధించారని చెప్పిన పవన్.. ప్రశ్నించే తత్వం లేకపోతే దోపిడీలు ఎక్కువైపోతాయని హెచ్చరించారు. నేర చరిత గల నేతలు పోవాలంటే ప్రజల్లోనే మార్పు రావాలని, ఆ మార్పు వచ్చే వరకు పోరాడతామని తేల్చిచెప్పారు.













