Pawan Kalyan: పిఠాపురంలో నాగబాబుకు పవన్ కొత్త బాధ్యతలు.. మరి వర్మ పరిస్థితి ఏమిటో?
కొణిదెల నాగబాబు (Nagababu) ఇప్పుడు జనసేనలో కీలక వ్యక్తిగా మారారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan )కు అండగా, పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు వెళ్తున్నారు. ఆయన ఎమ్మెల్సీ కావడం వల్ల ప్రత్యేక నియోజకవర్గం అవసరం లేకపోయినా, పార్టీ విషయాల్లో ప్రముఖంగా వ్యవహరించేందుకు ఎక్కువ అవకాశం ఉంది. ఇప్పుడే వస్తున్న వార్తల ప్రకారం, పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో (Pithapuram) పార్టీ బాధ్యతలను నాగబాబుకు అప్పగించనున్నట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిగా, పార్టీ అధినేతగా వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉండే కారణంగా, ఆయన తరఫున నియోజకవర్గం పరంగా అన్ని విషయాలను చూసుకోవడం నాగబాబు భుజాల మీదకు వచ్చే అవకాశం ఉంది. అధికారిక కార్యక్రమాల నిర్వహణ, అభివృద్ధి ప్రణాళికలు, ప్రజల సమస్యల పరిష్కారం వంటి అంశాల్లో ఆయన ప్రత్యక్షంగా పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
పిఠాపురం నియోజకవర్గం జనసేనకు (Janasena) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar) మాట్లాడుతూ, ఇది జనసేన గడ్డ అని ప్రకటించారు. ఇదే విషయాన్ని నాగబాబు కూడా సమర్థిస్తూ, పవన్ కళ్యాణ్ ప్రభావం ఇక్కడ గట్టిగా ఉందని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో, పవన్ కళ్యాణ్ భవిష్యత్తులో కూడా ఇదే నియోజకవర్గాన్ని శాశ్వతంగా కొనసాగించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడ మరో ఆసక్తికరమైన రాజకీయ అంశం ఉంది. 2014 ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మ, టీడీపీ నుంచి టికెట్ దక్కించుకోలేకపోయినా, 47 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఆయనకు అక్కడ మంచి మద్దతు ఉంది. 2024 ఎన్నికల్లో కూడా ఆయన పవన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. అయితే, వర్మ ప్రభావాన్ని తగ్గించేందుకు జనసేన వ్యూహాత్మకంగా ముందుకెళ్తుందా అనే చర్చ ప్రారంభమైంది. మెగా కుటుంబానికి చెందిన నాగబాబును రాజకీయంగా పిఠాపురంలో నిలబెట్టడం జనసేన ప్రణాళిక అన్న టాక్ నడుస్తోంది. దీని వల్ల భవిష్యత్తులో జనసేన ఆధిపత్యాన్ని మరింత బలపర్చడం, పార్టీ విజయాన్ని వ్యక్తిగతంగా ఎవరు క్రెడిట్ తీసుకోవకుండా చూడడం సులభమవుతుందని అర్థమవుతోంది.
ఇకపోతే, వర్మకు ఎమ్మెల్సీ పదవి రాకపోవడం, అదే సమయంలో నాగబాబుకు రావడం వంటి పరిణామాలు కూడా ఈ రాజకీయ సమీకరణాలను ఆసక్తికరంగా మార్చేశాయి. ఇప్పుడు నాగబాబు అధికారికంగా పిఠాపురం బాధ్యతలు తీసుకుంటే, జనసేన రాజకీయ వ్యూహం మరింత ఉత్కంఠభరితంగా మారే అవకాశముంది. ఈ వార్తలన్నీ ఎంతవరకు నిజమో తెలియాల్సి ఉంది కానీ, జనసేన భవిష్యత్తు వ్యూహంలో నాగబాబు పాత్ర మరింత ప్రాముఖ్యంగా మారబోతుందనేది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.













