అధికార యాత్రలు ..!
ఎన్నికలు దగ్గర పడుతున్నాయ్. ఐదేళ్లకోసారి ఎన్నికలు వస్తాయి. అది పరీక్షాకాలం. ఆ పరీక్షలో నెగ్గితే ఐదేళ్లు హ్యాపీగా ఉండొచ్చు. లేకుంటే మళ్లీ ఐదేళ్ల వరకూ వేచి చూడాల్సిందే. ఇప్పుడు అలాంటి సమయమే వచ్చింది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగబోతున్నాయ్. అందుకే అన్ని రాజకీయ పార్టీలు అస్త్రశస్త్రాలూ సిద్ధం చేసుకుంటున్నాయ్. నియోజకవర్గాల వారీగా పరిస్థితులును బేరీజు వేసుకుంటున్నాయ్. ఎక్కడ బలంగా ఉన్నాం.. ఎక్కడ బలపడాల్సి ఉంది.. ఏ నేతలను వదిలించుకోవాలి.. ఎవరిని లాక్కోవాలి.. ఎలాంటి హామీలు ఇవ్వాలి.. లాంటి అనేక అంశాలపై పార్టీల అధినేతలు ఫోకస్ పెట్టారు. ఏడాది ముందు నుంచే ప్రజల్లో ఉండేందుకు.. వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రణాలికలు రూపొందిస్తున్నారు. కొందరు పాదయాత్రలు చేస్తుంటే.. మరికొందరు ఏదో ఒక రూపంలో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. బాగా కలిసొచ్చిన యాత్రలనే దాదాపు అన్ని పార్టీలూ నమ్ముకున్నాయని చెప్పొచ్చు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వై.ఎస్.రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్.జగన్ పాదయాత్రలు చేసి అధికారంలోకి రాగలిగారు. ఇప్పుడు కూడా ఇదే బాటలో కొందరు పయనిస్తుంటే.. మరికొందరు పాదయాత్రలు కాకుండా మరో రూపంలో జనాల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో నేతల పాదయాత్రలు బాగా వర్కవుట్ అయ్యాయి. దీంతో ఇదే సెంటిమెంట్ ఫాలో అవుతున్నారు కొందరు నేతలు. నారా లోకేశ్, బండి సంజయ్, రేవంత్ రెడ్డి, వై.ఎస్.షర్మిల తదితరులు పాదయాత్రల్లో బిజీగా ఉన్నారు. మిగిలిన నేతలు కూడా వివిధ రూపాల్లో యాత్రలకు సిద్ధమవుతున్నారు.
నారా లోకేశ్ యువగళం!
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. వస్తున్నా మీకోసం అంటూ సాగిన ఆ యాత్రలో ఆయన 2817 కిలోమీటర్లు నడిచారు. ఇప్పుడు అంతకుమించిన యాత్ర చేస్తున్నారు ఆయన తనయుడు నారా లోకేశ్. తెలుగుదేశం పార్టీకి ఇది క్లిష్ట సమయం. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాల్సిన పరిస్థితి. అందుకే నారా లోకేశ్ అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యతను తన భుజాలపై వేసుకుని పాదయాత్ర ప్రారంభించారు. జనవరి 27న కుప్పంలో నారా లోకేశ్ పాదయాత్ర ప్రారంభమైంది. దీనికి యువగళం అని పేరు పెట్టారు. 400 రోజుల పాటు 4000 కిలోమీటర్లు నడవాలనేది ప్రాథమిక అంచనా. 400 రోజులు అంటే దాదాపు వచ్చే ఏడాది మార్చి వరకూ లోకేశ్ జనాల్లోనే ఉండనన్నారు. మేలో ఎన్నికలు జరగనున్నాయి. అంటే దాదాపు ఎన్నికల వరకూ ఆయన పాదయాత్ర సాగనుంది. తనను తాను నిరూపించుకునేందుకు లోకేశ్ కు ఇది మంచి అవకాశం. తండ్రిచాటు బిడ్డగానే ఇన్నాళ్లూ లోకేశ్ ను చూస్తూ వచ్చారు. అతనికేమీ తెలియదని.. ఆయనపై సెటైర్లు పేల్చుతూ జోకులు వేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు వాటన్నిటికీ లోకేశ్ సమాధానం చెప్పాల్సిన పరిస్థితి. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకుండానే ఎమ్మెల్సీగా చట్టసభల్లో అడుగు పెట్టి ఏకంగా మంత్రి అయ్యారు లోకేశ్. ఆ తర్వాత ప్రత్యక్ష ఎన్నికల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది. దీంతో లోకేశ్ సమర్థతపై నమ్మకం సడలింది. అందుకే ఇప్పుడు పాదయాత్ర ద్వారా ప్రజలకు తానేంటో చెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు లోకేశ్. అందుకే ఇంద్రభవనాలు వదిలి ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టారు. ప్రజలతోనే నిత్యం మమేకమవుతూ సాగుతున్నారు. రైతులు, మహిళలు, యువకులు, ఉద్యోగులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలను కలుస్తూ వారి సాధకబాధకాలు తెలుసుకుంటున్నారు. తనను తాను మలుచుకునేందుకు, రాజకీయాల్లో రాటు దేలేందుకు ఇదొక సదవకాశం. దీన్ని సద్వినియోగం చేసుకునే పట్టుదలతో ఉన్నారు లోకేశ్.
అయితే ఆంధ్రప్రదేశ్ లో ఇంతకుముందు లాంటి పరిస్థితులు లేవు. ప్రభుత్వ, పోలీసు ఆంక్షలు ఎక్కువయ్యాయి. కందుకూరు, గుంటూరులో చంద్రబాబు సభల్లో తొక్కిసలాటలు జరిగి 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. జీవో నెంబర్ 1ని అమలు చేస్తోంది. దీని ద్వారా పాదయాత్రలు, ర్యాలీలు, సభలు నిర్వహించాలంటే కచ్చితంగా ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి. ఈ అనుమతులు కూడా అనేక ఆంక్షల మధ్య లభిస్తున్నాయి. ఇప్పుడు లోకేశ్ పాదయాత్రకు కూడా అనేక నిబంధలను విధించింది ప్రభుత్వం. వాటి మధ్యే లోకేశ్ ప్రస్థానం ప్రారంభించారు. మరోవైపు లోకేశ్ పాదయాత్రకు పెద్దగా స్పందన లేదని టీడీపీ మథనపడుతోంది. ఆయన యాత్రను ఎలాగైనా సక్సెస్ చేయాలనే పట్టుదలతో ఉంది.
‘వారాహి’తో వస్తున్న పవన్ కల్యాణ్!
ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా జనంలోకి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ఆయన వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ సర్కార్ ను గద్దె దించుతానని శపథం చేశారు పవన్ కల్యాణ్. ఇందుకోసం ఎవరితోనైనా కలుస్తానని.. ఎందాకైనా వెళ్తానని స్పష్టం చేశారు. ఇంతకాలం ఆయన పాలిటిక్స్ పై పెద్దగా దృష్టి పెట్టలేదు. సినిమాలు చేసుకుంటూ బిజీగా ఉంటున్నారు. అయితే వచ్చే నెల నుంచి ఏడాదిపాటు పూర్తిగా ప్రజల్లోనే ఉండే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. వాస్తవానికి పవన్ కల్యాణ్ కూడా ముందు పాదయాత్ర చేయాలనుకున్నారు. అయితే ఆయనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ను తట్టుకుని పాదయాత్ర చేయడమంటే మామూలు విషయం కాదు. భద్రత పెద్ద సమస్యగా మారుతుంది. అందుకే రాష్ట్రమంతటా రోడ్డు షోలు చేపట్టాలని డిసైడయ్యారు. ఇందుకోసం వారాహి వాహనాన్ని సిద్ధం చేసుకున్నారు పవన్ కల్యాణ్.
మార్చి లేదా ఏప్రిల్లో వారాహిని పవన్ కల్యాణ్ బయటకు తీస్తారని తెలుస్తోంది. మార్చి 14 జనసేన ఆవిర్భావ దినం. ఆరోజు నాటికి పార్టీ సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి రోజున వారాహి యాత్ర ప్రారంభించే అవకాశం ఉందని జనసేన వర్గాలు చెప్తున్న మాట. సెంటిమెంటుగా తిరుపతి నుంచి యాత్ర ప్రారంభించవచ్చని తెలుస్తోంది. అప్పటికి పొత్తులపైన కూడా ఒక క్లారిటీ రావచ్చు. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి జనసేన పోటీ చేస్తుందనే ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఏఏ నియోజకవర్గాల్లో జనసేన పోటీ చేస్తుందనేది ఇప్పట్లో తేలే అంశం కాదు. ఆ క్లారిటీ వస్తే ఆ నియోజకవర్గాలపైనే ఎక్కువ ఫోకస్ పెట్టాలనుకుంటున్నారు పవన్ కల్యాణ్. అందుకే యాత్ర ఆలస్యమవుతోందని తెలుస్తోంది.
మరోవైపు వారాహిపైన అనేక విమర్శలు, సెటైర్లు పేలుతున్నాయి. పవన్ కల్యాణ్ కు మాస్ ఫాలోయింగ్ ఎక్కువ. ఇన్నాళ్లూ ఆయన కార్లలో ప్రయాణిస్తూ వచ్చారు. దీంతో చాలాచోట్ల ఆయనతో ఫోటోలు దిగేందుకు, ఆయనకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు జనం ఎగబడ్డారు. దీంతో అనేక సమస్యలు ఎదురవుతూ వచ్చాయి. వీటిని దృష్టిలో పెట్టుకుని ఈసారి అలాంటి సమస్యలు రాకుండా ఉండేందుకు మిలిటరీ తరహా వారాహి వాహనాన్ని డిజైన్ చేయించుకున్నారు. ఈ వాహనంలో సకల హంగులూ సమకూర్చుకున్నారు. ఈ వాహనం పైకి ఎక్కితే ఎవరికీ అందనంత ఎత్తులో ఉంటారు. కాబట్టి భద్రతాపరమైన సమస్యలు ఉత్పన్నం కావు. అయితే ఈ వాహనం మిలిటరీ రంగులో ఉండడంతో రిజిస్ట్రేషన్ చేయకపోవచ్చని వైసీపీ నేతలు చెప్పుకుంటూ వచ్చారు. అయితే నిబంధనలకు అనుగుణంగా ఉందంటూ హైదరాబాద్ ఆర్టీఏ అధికారులు రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. అయితే హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసినందున తాము ఆంధ్రప్రదేశ్ లో తిరగనివ్వబోమని మంత్రి గుడివాడ అమరనాథ్ హెచ్చరించారు. అయితే ఎవరడ్డుకుంటారో చూస్తానంటూ పవన్ కల్యాణ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా అధికార పక్షానికి, జనసేనకు మధ్య రోజూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. ఇక పవన్ కల్యాణ్ రోడ్లపైకి వస్తే ఇంకెలాంటి పరిస్థితులు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
బస్సెక్కి వస్తానంటున్న జగన్!
ఇక అధికార వైసీపీ కూడా తామేం తక్కువ కాదంటోంది. వచ్చే ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసి రెండోసారి అధికారంలోకి రావాలనుకుంటున్నారు సీఎం వై.ఎస్.జగన్. 2019 ఎన్నికల్లో 151 సీట్లు సాధించింది వైసీపీ. అయితే ఇప్పుడు సుపరిపాలన అందించాం కాబట్టి 175కు 175 సీట్లూ సాధించగలమనే నమ్మకంతో ఉన్నారు జగన్. ఇదే విషయాన్ని ఆయన కేడర్ కు పదే పదే చెప్తూ వస్తున్నారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ ఏదో ఒక రూపంలో న్యాయం చేశామని.. అందుకే ప్రతి ఇంటికీ వెళ్లి ఓట్లడిగితే తప్పకుండా ఆదరిస్తారని చెప్తున్నారు. అందుకే గడపగడపకు మన ప్రభుత్వం పేరటి దాదాపు ఏడాది నుంచే పార్టీ నేతలను ఇంటింటికీ తిప్పుతున్నారు జగన్. వాళ్లకు ఎప్పటికప్పుడు మార్కులు వేస్తూ పరుగులు పెట్టిస్తున్నారు. రిపోర్ట్ ఆధారంగానే సీట్లు కేటాయిస్తానని.. చివరి నిమిషంలో సీటు రాకపోతే బాధపడొద్దని ఇప్పటి నుంచే చెప్తూ వస్తున్నారు.
అయినా జగన్ మాటను కొంతమంది ప్రజాప్రతినిధులు పెడచెవిన పెడుతూ వస్తున్నారు. సుమారు పాతికమందికి పైగా ప్రజాప్రతినిధులు గడపగడపకు ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనలేదు. కొంతమంది అడపాదడపా మాత్రమే పాల్గొంటున్నారు. ఎన్నిసార్లు చెప్పినా వాళ్లు తీరు మార్చుకోవట్లేదు. మరోవైపు అంతర్గత సర్వేల్లో పార్టీ పరిస్థితి దిగజారుతున్నట్లు నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తప్పవని భావించిన జగన్.. తానే నేరుగా రంగంలోకి దిగేందుకు సిద్ధమయ్యారు.
ఏప్రిల్ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని సీఎం వై.ఎస్.జగన్ నిర్ణయించారు. నియోజకవర్గంలో కొన్ని మండలాలను ఎంపిక చేసుకుని.. ఒక్కో మండలంలో రెండు గ్రామాల్లో యాత్ర ఉండేలా షెడ్యూల్ రెడీ చేస్తున్నారు. వీలైతే కొన్ని గ్రామాల్లో బస చేసి అక్కడే రచ్చబండ లాంటి కార్యక్రమం నిర్వహించాలని భావిస్తున్నారు. ఎన్నికల వరకూ ఈ బస్సు యాత్ర కొనసాగనున్నట్టు తెలుస్తోంది. తానే నేరుగా జనంలోకి వెళ్తే క్షేత్రస్థాయి పరిస్థితులు తెలుసుకోవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. ఎక్కడైనా స్థానిక ప్రజాప్రతినిధులపై వ్యతిరేకత ఉన్నా తెలుసిపోతుంది. అలాంటప్పుడు అభ్యర్థి పైనా నిర్ణయం తీసుకునే అవకాశం కలుగుతుంది. అంతేకాదు.. అలాంటి చోట్ల అభ్యర్థిని కాకుండా తనను చూసి ఓటేయండని అడిగేందుకు జగన్ సిద్ధమయ్యారు. పార్టీ అధినేతగా, ప్రభుత్వ అధినేతగా ఎలాంటి కార్యక్రమమైనా అమలు చేసేది తానే కాబట్టి తనను దీవించాలని కోరనున్నారు.. ఇలా ఆంధ్రప్రదేశ్ లో అన్ని ప్రధాన పార్టీలు యాక్టివ్ అయిపోయాయి. ఎన్నికల మూడ్ తెచ్చేశాయి.
తెలంగాణలోనూ యాత్రల సీజన్
తెలంగాణలో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. వరుసగా మూడోసారి అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. తెలంగాణ ఏర్పడ్డాక వరుసగా రెండుసార్లు అధికారంలోకి వచ్చారు కేసీఆర్. ముచ్చటగా మూడోసారి కూడా పగ్గాలు చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలనుకుంటున్నారు. ఇక కేసీఆర్ ను ఎలాగైనా సీఎం సీటు నుంచి దించేయాలని బీజేపీ, కాంగ్రెస్ అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాయి. ఇందుకోసం వివిధ మార్గాల్లో ప్రజల ఆశీర్వాదం కోరుతున్నాయి. ఇక్కడ కూడా విపక్షాలన్నీ ప్రజల బాట పట్టాయి.
తెలంగాణలో కూడా యాత్రల సీజన నడుస్తోంది. ఏపీలో ఒక తరహా రాజకీయం నడుస్తుంటే.. తెలంగాణలో అంతకు మించి.. అన్నట్టు సాగుతోంది. అన్ని పార్టీలూ తగ్గేదే లే అంటున్నాయి. అధికార బీఆర్ఎస్ మినహా మిగిలిన పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలో వాలిపోయాయి. బీజేపీ, కాంగ్రెస్, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జనాలతో మమేకం అయ్యేందుకు పరితపిస్తున్నాయి. ఈ మూడు పార్టీల నేతలు పాదయాత్రలో సందడి చేస్తున్నారు. అధికార బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ కంటే ఎక్కువగా దేశంపై ప్రస్తుతం ఫోకస్ పెట్టింది. దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించేందుకు మొగ్గు చూపుతోంది. దీంతో ఇదే అదనుగా భావిస్తున్న విపక్షాలు గ్రామాల బాట పట్టాయి.
సంగ్రామం షురూ చేసిన బండి!
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చాలాకాలంగా విడతలవారీగా పాదయాత్ర చేస్తున్నారు. ప్రజాసంగ్రామ యాత్ర పేరిట బండి సంజయ్ ప్రజల ఆశీర్వాదం కోరుతున్నారు. ఇప్పటికే ఐదు విడతలపాటు ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర పూర్తి చేశారు బండి సంజయ్. ఎంపిక చేసుకున్న రూట్లలో దాదాపు నెల రోజుల పాటు కొనసాగేలా ఈ యాత్రలు ఉంటాయి. రాత్రింబవళ్లు ప్రజలతోనే ఉంటూ.. వారితో మమేకం అవుతూ ఈ యాత్రలు సాగుతుంటాయి. మొదట్లో, చివర్లో బహిరంగసభలు నిర్వహిస్తారు. ఈ సభలకు జాతీయ స్థాయి నేతలను తీసుకొచ్చి అటెన్షన్ డ్రా చేస్తుంటారు. కేసీఆర్ సర్కార్ ను ఎలాగైనా గద్దె దించాలనేది బండి సంజయ్ ప్లాన్. అందుకే కేసీఆర్ ప్రభుత్వాన్ని పదేపదే టార్గెట్ చేస్తుంటారు. హిందుత్వ నినాదంతో రచ్చ రాజేస్తుంటారు. అయితే ఒక్కోసారి ఆయన నోటిదురుసు ఇబ్బందులు తెచ్చిపెడుతూ ఉంటుంది. అయనా ఏ మాత్రం ఖాతరు చేయకుండా ముందుకు సాగడం బండి సంజయ్ నైజం. ఈసారి బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం సీటులో కూర్చునే అవకాశం దక్కుతుందనేది బండి సంజయ్ ఆలోచన. అందుకే ప్రస్తుతం ఎంపీగా ఉన్న సంజయ్.. ఈసారి అసెంబ్లీ బరిలో నిలుస్తారని ఆయన సన్నిహితులు చెప్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా క్రెడిట్ అంతా తనకే దక్కాలని పరితపిస్తున్నారు.
ఇంట గెలవని రేవంత్.. యాత్రతో ప్రజల్ని గెలుస్తారా..?
ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా పాదయాత్ర ప్రారంభించారు. రాహుల్ గాంధీ నిర్వహించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ నేతలు హాత్ సే హాత్ జోడో పేరిట పాదయాత్రలు చేస్తున్నారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే రేవంత్ రెడ్డిపై కారాలు మిరియాలు నూరుతున్న సీనియర్లు ఈ కార్యక్రమానికి కూడా దూరంగానే ఉంటున్నారు. రేవంత్ రెడ్డి అంటే ముందు నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్లకు అస్సలు గిట్టదు. అందుకే రేవంత్ రెడ్డిపైన బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తుంటారు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం హైకమాండ్ చెప్పినట్టు నడుచుకుంటున్నారు. ఇప్పుడు కూడా సీనియర్లు తనను ఏమాత్రం ఖాతరు చేయకపోయినా తాను మాత్రం యాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. అయితే తన వ్యక్తిగత అజెండాతోనే యాత్ర చేస్తున్నారని సొంత పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. తనతో పాటు టీడీపీ నుంచి వచ్చిన నేతలే ఆయన వెంట ఉన్నారని దుయ్యబడుతున్నారు. అయితే.. రేవంత్ రెడ్డి మాస్ లీడర్. ఆయన ఎక్కడ ఉన్నా జనం గుమికూడుతుంటారు. ఇప్పుడు పాదయాత్రలో కూడా జనం వస్తున్నారు. కానీ అంతర్గత విభేదాలే కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్. అందరూ ఏకతాటి పైన నిలిచి.. నడిస్తే.. కచ్చితంగా ప్రభావం చూపించగలదు. కానీ కాంగ్రెస్ పార్టీలో అలా జరుగుతుందని ఆశించడం అత్యాశే. రేవంత్ రెడ్డితో పాటు మరికొంతమందిని కూడా పాదయాత్ర చేయాలని హైకమాండ్ ఆదేశించింది. కానీ వాళ్లు పట్టించుకోలేదు. ఇలా చేస్తున్న నాయకుడిని విమర్శిస్తుంటారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో అంతే.. అనే సామెత మరోసారి రుజువైంది.
అత్తారింట కోడలు షర్మిల సందడి!
తెలంగాణలో తన సత్తా ఏంటో నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు వై.ఎస్.షర్మిల. తెలంగాణ కోడలిగా తనకు అధికారం ఉందనే నినాదంతో ఆమె ఇక్కడ పార్టీ పెట్టారు. వై.ఎస్.ఆర్. తెలంగాణ పార్టీ పెట్టి హడావుడి చేస్తున్నారు. తెలంగాణలో రాజన్నరాజ్యం తీసుకొస్తానని ఆమె చెప్తున్నారు. ఇందుకోసం ఆమె తనకు బాగా అలవాటైన పాదయాత్రనే నమ్ముకున్నారు. అన్న జగన్ జైలులో ఉన్నప్పుడు ఆయన బదులు సుదీర్ఘ పాదయాత్ర చేశారు వై.ఎస్.షర్మిల. ఇప్పుడు తనకోసం నేరుగా రంగంలోకి దిగారు. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ గా చేసుకుని పదునైన విమర్శలు చేస్తున్నారు షర్మిల. బీజేపీ, కాంగ్రెస్ లను మించి ఆమె కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఆమె మాటలే ఒక్కోసారి ఆమెకు ఇబ్బందిగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పై ఆమె చేసిన విమర్శలు సహించలేని ఆ పార్టీ నేతలు.. షర్మిల పాదయాత్రను అడ్డుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేసి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఇక్కడ కూడా ఆమె హడావుడి చేయడంతో మరోసారి ఇంటికే పరిమితం చేశారు. చివరకు హైకోర్టుకు వెళ్లి పాదయాత్రకు పర్మిషన్ తెచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కోర్టు ఆదేశాల మేరకు షర్మిల పాదయాత్ర చేస్తున్నారు. అధికారంలోకి రావాలనేది ఆమె తపన. అయితే ఆ స్థాయి లేదని ఆమెకూ తెలుసు. అందుకే కనీసం కొన్ని స్థానాల్లో అయినా సత్తా చాటితే కింగ్ మేకర్ పాత్ర పోషించవచ్చనుకుంటున్నారు. అందుకే ఎంపిక చేసిన స్థానాల్లో గట్టిగా అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నారు.
దేశం చుట్టేసిన రాహుల్ గాంధీ!
తెలుగు రాష్ట్రాల సంగతి పక్కన పెడితే.. వీళ్లందరికంటే ముందే కాంగ్రెస్ పార్టీ యువనేత రాహుల్ గాంధీ దేశం మొత్తం చుట్టేశారు. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకూ పాదయాత్ర చేశారు. 2022 సెప్టెంబర్ 7న కన్యాకుమారిలో పాదయాత్ర ప్రారంభించిన రాహుల్ గాంధీ.. 2023 జనవరి 29న కశ్మీర్ లో ముగించారు. 136 రోజులపాటు సాగిన ఈ యాత్ర కాంగ్రెస్ పార్టీలో జోష్ తీసుకొచ్చింది. ఇదే ఉత్సాహంతో పని చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గెలవాలని కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అధికారం విషయం పక్కన పెడితే.. క్షేత్రస్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు రాహుల్ గాంధీకి ఈ యాత్ర ఎంతో దోహదపడింది. రాహుల్ గాంధీని యాత్రకు ముందు.. యాత్రకు తర్వాత అన్నట్టు బేరీజు వేయడం మొదలైంది. యాత్ర ద్వారా రాహుల్ ప్రజలకు దగ్గరయ్యారనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగినప్పుడే యాత్రకు సరైన అర్థం దొరికినట్టవుతుంది.
ఇలా ఎన్నికల సీజన్ మొదలు కావడంతో నేతలంతా యాత్రలు మొదలు పెట్టేశారు. యాత్రలు చేసే వాళ్లంతా అధికారంలోకి రావడం కష్టం. ఒక రాష్ట్రంలో ఒక్కరే అధికారంలోకి రాగలరు. అయితే యాత్రల ద్వారా ప్రజల సమస్యలు అర్థమవుతాయి. అదే సమయంలో తాము చెప్పాలనుకున్న విషయాలను కూడా నేరుగా ప్రజలతో పంచుకోవచ్చు. అయితే ప్రజలు ఎవరిని ఆదరిస్తారో ఇప్పుడే చెప్పడం కష్టం. ఇందుకు ఇంకా చాలా సమయం ఉంది. యాత్రలు పరీక్షలయితే.. ఎన్నికల ఫలితాలు రిజల్ట్స్. సో.. అప్పటి వరకూ వెయిట్ చేయాల్సిందే.!
సి.యల్.యన్.రాజు
clnraju@gmail.com













