కార్యకర్తలకు సముచిత స్థానం : పల్లా శ్రీనివాసరావు
తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో బాధ్యతలు స్వీకరించిన అనంతరం పార్టీ కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన పార్టీ జాతీయ అద్యక్షుడు, సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించి ప్రభుత్వంలో భాగం చేయడమే ప్రధాన కర్తవ్యంగా పనిచేస్తానన్నారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ ముందుకెళ్తానని తెలిపారు. ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికల్లోనూ ఇంతే మెజార్టీతో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా కృషి చేస్తానని తెలిపారు. రాజకీయ ప్రేరేపిత కేసుల్ని కొట్టివేయిస్తామన్నారు. పార్టీ శ్రేణులకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.













