పద్మావతి పరిణయోత్సవాలు ఆరంభం
పద్మావతి, శ్రీనివాసుల పరిణయోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. శ్రీమలయప్పస్వామి గజ వాహనాన్ని అధిరోహించి ఆలయం నుంచి ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనానికి వెళుతుండగా శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు పల్లకిపై అనుసరిస్తూ వేంచేశారు. నారాయణగిరిలో భూలోక వైకుంఠాన్ని తలపించేలా స్వర్ణకాంతులు విరజిమ్మేలా శోభాయమానంగా అష్టలక్ష్మి మండపాన్ని రూపొందించారు. ఇక్కడ నిత్య వధూవరులైన తిరుమలేశునికి, దేవేరులకు ఎదుర్కోలు ఉత్సవం, పూలబంతులాట, నూతన వస్త్ర సమర్పణ కోలాహలంగా, శాస్త్రోక్తంగా జరిగాయి. అనంతరం స్వామి వారికి కొలువు (ఆస్థానం) జరిగింది. ఈ కొలువులో శ్రీవేంకటేశ్వరస్వామి వారికి వేదాలు, పురాణాలు, సంగీతరాగాలు, కవితలు నివేదించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారుల స్వరార్చన భక్తులను అలరించింది. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీమలయప్పస్వామి బంగారు పల్లకినెక్కి ఆశేష భక్తజనం మధ్య ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేయడంతో మొదటిరోజు ఉత్సవం పరిసమాప్తమైంది.
పరిణయోత్సవ మండపాన్ని టీటీడీ ఉద్యానశాఖ రంగురంగుల పుష్పాలతో, విద్యుద్దీపాలతో శోభాయమానంగా ముస్తాబు చేసింది. ఆనంద నిలయ విమాన వేదికను రూపొందించి వివిధ రకాలఫలాలతో విశేషంగా అలంకరించారు. టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు పాల్గొన్నారు.













