ఏపీలో మరో మూడు విగ్రహాలు ధ్వంసం
ఆంధప్రదేశ్‌లో ఆలయాలు, దేవతామూర్తుల విగ్రహాలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. రోజుకో చోట ఏద ఒక రూపంలో దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసం ఘటనలు కలకలం రేపుతున్నాయి. విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహ ధ్వంసం ఘటన మరవకముందే తాజాగా ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. సింగరాయ కొండ మండలంలోని పాతసింగరాయకొండ గ్రామంలో దక్షిణ సింహాచలంగా ప్రసిద్ధిగాంచిన వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి వెళ్లే ముఖ ద్వారంపై ఉన్న మూడు విగ్రహాల (లక్ష్మీనరసింహ స్వామి, రాజ్యలక్ష్మి, గరుత్మంతుడు)చేతులు విరిగిపోయి ఉన్నాయి. ఇది గమనించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం అందించారు.
సింగరాయకొండ సీఐ శ్రీనివాసులు, ఎస్సై సంపత్ కుమార్ సంఘటనాస్థలికి చేరుకొని ముఖద్వారాన్ని, విగ్రహాలను పరిశీలించారు. ఇది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేశారా..లేక వాటంతట అవే విరిగిపోయాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టీడీపీ, వైకాపా నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు.













