తిరుపతి ఉపఎన్నిక రద్దవుతుందా..?
తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ ఉపఎన్నిక ముగిసింది. వచ్చే నెల 2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు తిరుపతి రిజల్ట్ కూడా రానుంది. అయితే ఈ ఉపఎన్నిక ఎలాంటి మలుపులు తీసుకుంటుందోననే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. ఎందుకంటే తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో అనేక అక్రమాలు జరిగాయని.. ఈ ఎన్నికను రద్దు చేయాలంటూ విపక్షాలు కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లాయి. తాజాగా బీజేపీ అభ్యర్థి రత్నప్రభ హైకోర్టు ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఉపఎన్నిక రద్దవుతుందా.. లేకుంటే యధాతథంగా ఫలితం వెలువడుతుందా.. అనే టెన్షన్ పట్టుకుంది.
తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నిక ఈ నెల 17వ తేదీన జరిగింది. పోలింగ్ రోజు పలువురు నకిలీ ఓటర్లు పట్టుబడ్డారు. అభ్యర్థులే నేరుగా నకిలీ ఓటర్లను గుర్తించి పోలింగ్ కేంద్రాల నుంచి పంపించేశారు. అధికార పార్టీ నేతలు పొరుగు నియోజకవర్గాల నుంచి మనుషులను తీసుకొచ్చి వారిచేత దొంగ ఓట్లు వేయించారని విపక్షాలు ఆరోపించాయి. నకిలీ ఓటర్ల వీడియోలను రికార్డు చేసి సర్క్యులేట్ చేశాయి. టీడీపీ నేతలు పలు బస్సులను అడ్డుకుని నకిలీ ఓటర్లను గుర్తించారు. వారిపై చర్యలు తీసుకోవాల్సిందిగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోవట్లేదని విపక్ష నేతలు ఆరోపిస్తున్నారు.
పోలీసులు చర్యలు తీసుకుంటాం అని చెప్తున్నారు కానీ సీరియస్ గా రియాక్ట్ కావట్లేదని బీజేపీ నేతలు విమర్శిస్తున్నారు. అందుకే ఈ అంశాన్ని కోర్టులోనే తేల్చుకోవాలని బీజేపీ అభ్యర్థి రత్నప్రభ నిర్ణయించారు. నకిలీ ఓటర్లు వెల్లువెత్తారని, ఈ ఎన్నిక అప్రజాస్వామికమని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. భారీగా దొంగ ఓట్లను సృష్టించారని, ఫోర్జరీ కార్డులతో ఓట్లేశారని ఆమె పిటిషన్ లో పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లామని.. అయినా స్పందన లేదని రత్నప్రభ ఆరోపించారు. ఈ ఎన్నికను రద్దు చేయాలని.. ఫలితం వెల్లడించకుండా స్టే ఇవ్వాలని హైకోర్టును అభ్యర్థించారు. మరోవైపు ఇదే అంశంపై కేంద్ర ఎన్నికల కమిషనర్ కు సుదీర్ఘ లేఖ రాశారు టీడీపీ అధినేత చంద్రబాబు. పలు ఆధారాలను కూడా లేఖకు జతచేస్తున్నట్టు చెప్పారు. ఈ ఎన్నికపై చర్య తీసుకోవాలని కోరారు.
అధికార పార్టీ మాత్రం విపక్షాల ఆరోపణలను తోసిపుచ్చుతోంది. గతంతో పోల్చితే తక్కువ పోలింగ్ జరిగిందని.. దొంగఓట్లు వేసింటే పోలింగ్ శాతం పెరగాలి కదా.. అని ప్రశ్నిస్తోంది. అయితే విపక్షాలు మాత్రం ఈ ఎన్నికను చాలా సీరియస్ గా తీసుకున్నాయి. ఎన్నికల సంఘానికి ఎన్నోసార్లు ఫిర్యాదులు చేశాయి. అయినే CEC నుంచి సరైన స్పందన రాలేదు. దీంతో చివరగా కోర్టు మెట్లెక్కాయి. మరిప్పుడు ఈ ఉపఎన్నికపై హైకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తిగా మారింది. ఇవాళో రేపో ఈ పిటిషన్ విచారణకు రానుంది.













