ONGC: ఆంధ్రప్రదేశ్‌లో ఓఎన్‌జీసీ భారీ పెట్టుబడులు

ప్రభుత్వ రంగంలోని ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఓఎన్‌జీసీ) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో చమురు, సహజ వాయువుల అన్వేషణను ఉధృతం చేస్తోంది. ఇందులో భాగంగా రూ.8,110 కోట్ల పెట్టుబడి అంచనాతో రాష్ట్రంలోని కృష్ణా–గోదావరి (Krishna-Godavari) (కేజీ) బేసిన్ ప్రాంతంలోని భూ ఉపరితల ప్రాంతాల్లో 172 బావులు తవ్వబోతోంది. కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ (ఎంఈఎఫ్‌సీసీ)కు చెందిన నిపుణుల కమిటీ ఇందుకు ఆమోదం తెలిపింది. కోనసీమ ప్రాంతంలో తనకు కేటాయించిన ఎనిమిది పెట్రోలియం మైనింగ్ లీజు (పీఎంఎల్) బ్లాకుల్లో ఓఎన్‌జీసీ ఈ తవ్వకాలు జరపనుంది. ఇందులో పర్యావరణ నిర్వహణ ప్రణాళిక (ఈఎంపీ) కోసం రూ.172 కోట్లు, ప్రజాభిప్రాయ సేకరణ కోసం రూ.11 కోట్లు ఖర్చు చేయనుంది. కేజీ బేసిన్ ప్రాంతంలో చమురు, గ్యాస్ తవ్వకాలకు అనుమతి ఇస్తూనే పర్యావరణ సంరక్షణకు ఎంఈఎఫ్‌సీసీ (MEFCC) పెద్దపీట వేసింది. ఓఎన్‌జీసీ తవ్వే ఈ 172 బావుల్లో ఏ బావి కూడా కోరంగి వన్యప్రాణి సంరక్షణా కేంద్రానికి పది కిలోమీటర్ల లోపు ఉండకూడదని స్పష్టం చేసింది. అలాగే ముందస్తు అనుమతి లేకుండా అటవీ ప్రాంతాలు, సంరక్షిత ప్రాంతాల నుంచి ఎలాంటి పైప్‌లైన్లు వేయకూడదని షరతు విధించింది.