ఒకప్పుడు మాయావతి దారిలో.. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వెళ్తున్నారా..
ఆ నాయకులను వదిలించుకోకపోతే.. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి కూడా మాయావతి లా అవుతుందా..
ఆంధ్రాలో మొన్న జరిగిన ఎన్నికల అనంతరం ప్రతి ఒక్కరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే.. జగన్ ఓటమికి కారణం ఏమిటి? 2019లో జరిగిన ఎన్నికల్లో 151 స్థానాలలో ఘన విజయం సాధించి దేశం మొత్తం ఆశ్చర్యపోయేలా ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన జగన్.. 2024 ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదాని కూడా ఎందుకు దక్కించుకోలేకపోయారు అనే విషయం సర్వత్రా చర్చనీయాంశంగా ఉంది. పథకాలు ఇచ్చారు, పెన్షన్లు పెంచారు.. ప్రజలకు మిగిలిన ప్రభుత్వాలు ఎంత చేశాయో అంతా చేశారు.. కానీ లోపం ఎక్కడ ఉంది అంటే..జగన్మోహన్ రెడ్డి వెనుక ఉన్న వ్యక్తులలో ఉంది అన్న టాక్ బలంగా వినిపిస్తోంది. ఓటమి అనేక కారణాలతో వచ్చినప్పటికీ ప్రముఖంగా కొందరు నాయకులు మాత్రం ఈ ఓటమికి కారకులు అని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇప్పటికి కూడా ఆ నాయకులను వెనక వేసుకొని ఉన్నారు. ఏ నాయకుల నోటి దురుసు కారణంగా ప్రజలకు పార్టీపై విశ్వాసం సన్నగిల్లిందో నాయకులను జగన్మోహన్ రెడ్డి సమర్థించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.
ఇప్పటికైనా జగన్ మోహన్ రెడ్డి లో మార్పు రాకపోతే వచ్చే ఎన్నికల్లో పార్టీ ఉనికికే ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. ఒకప్పుడు ఉత్తర ప్రదేశ్ లో నా ఇష్టం.. నా పార్టీ ..నా నాయకులు.. అని మాట్లాడిన మాయావతి పరిస్థితి ఏమయిందో అందరికీ తెలుసు. అదే పరిస్థితి జగన్ మోహన్ రెడ్డికి కూడా త్వరలో ఎదురవుతుందేమో అని అనిపిస్తోంది. మాయావతి అధికారంలో ఉన్నప్పుడు ఆమె పార్టీ అనేక విమర్శలను ఎదుర్కొంది. వాటి నుంచి వీలైనంత త్వరగా కోలుకోవాలని.. మొండి వైఖరి వదిలి ఎక్కడ తప్పు జరుగుతోందో తెలుసుకొని సరి చేసుకోవాలి అని ఆమెకు అనేక సూచనలు వచ్చాయి. కానీ ఆమె మొండిగా ఎవరి మాట పట్టించుకోలేదు.
దాని ఫలితం ఎక్కడైతే అధికారంలో ఉంది అన్న ధీమా వ్యక్తం చేశారో అక్కడ కేవలం నాలుగు అంటే నాలుగు స్థానాలకు ఆమె పార్టీ పరిమితమైంది. ఒంటి చేత్తో రాష్ట్రంలో చక్రం తిప్పిన చేయి కుప్పకూలిపోయింది. కట్ చేస్తే ఈరోజు వైసిపి అదే పరిస్థితి ఎదుర్కొంటోంది. ఇప్పటికైనా తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఏ విషయాల వల్ల ప్రజలు తమకు దూరమయ్యారు అన్న విషయాన్ని గమనించి.. తిరిగి ప్రజలలోకి వెళ్లి.. వారు హర్షించదగిన పనులు చేపట్టి.. వారి అండ దండ సంపాదించాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డికి ఎంతో ఉంది. దేశ రాజకీయ చరిత్రలో నేర్చుకోవలసిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. అయితే ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి దేన్ని ఫాలో అవుతారు అన్న విషయం వేచి చూడాలి..













