పెట్రోల్ మంటపై కామ్రేడ్ల నిరసన…20న
పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను వ్యతిరేకిస్తూ ఈ నెల 20న రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఆంధ్రప్రదేశ్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపిచ్చారు. గత 11 రోజులుగా ఇంధన ధరలు పెరుగుతూనేపోతున్నాయని ఆయన మండిపడ్డారు. అలా కాస్త కాస్తగా రోజువారీ పెరుగుదలతో లీటర్ పెట్రోల్ పై రు.6.02, డీజిల్ పై రు.6.40 పెరిగాయని ఇది సామాన్యులకు మరింత భారంగా కానుందన్నారు. కార్పొరేట్లు తప్ప మరెవరూ పట్టని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోలు ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాలను విపరీతంగా పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తొందంటూ విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా ఓ వైపు ముడి చమురు ధరలు భారీగా తగ్గినప్పటికీ మరోవైపు దేశంలో పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయన్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఆర్ధికంగా కుదేలైన సామాన్యులుపై ఇది పెనుభారం మోపడమేనన్నారు.
పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాంకు రుణ ఎగవేతదారులకు, కార్పొరేట్ శక్తులకు భారీగా తాయిలాలు ఇస్తున్న కేంద్రం ప్రజలపై పెట్రోభారం మోపడం తగదని ఈ నేపధ్యంలో పెట్రో ధరలపై నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నామన్నారు. దీనిలో భాగంగా ఈ నెల 20న సిపిఐ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని శాఖల్లో జరగనున్న నిరసన కార్యక్రమాలను జయప్రదం చేయాలని ప్రజానీకానికి విజ్ఞప్తి చేశారు.













