ఆంధ్రప్రదేశ్ నుండి పెరిగిన విమాన ప్రయాణీకుల సంఖ్య
విమాన మార్గం మరింత రద్దీ!
రాష్ట్రంలోని విమానాశ్రయాలు రెండేళ్లుగా ప్రయాణికులతో కళకళలాడుతున్నాయి. రాష్ట్రంలో విమానయాన రంగ అభివృద్ధికి ఉన్న అవకాశాలను ఇది స్పష్టం చేస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కాలంలో వివిధ విమానాశ్రయాల నుంచి మొత్తం 17,42,291 మంది ప్రయాణించారు. గతేడాది ఇదే సమయంతో పోల్చితే ఇది 16 శాతం ఎక్కువ. విశాఖ, విజయవాడ, తిరుపతి, రాజమహేంద్రవరం, కడపలో విమానాశ్రయాలున్నాయి. ఇందులో ఒక్క విశాఖ మాత్రమే లోగడ రద్దీగా కనిపించేది. ప్రస్తుతం మిగిలిన విమానాశ్రయాలు కూడా క్రమేణా రద్దీగా మారుతున్నాయి. కడప విమానాశ్రయం నుంచి విమాన సేవలు ప్రారంభించడంతో అక్కడినుంచి కూడా ప్రయాణికుల సంఖ్య ఏటా గణనీయంగా పెరుగుతోంది. గతేడాది ఏప్రిల్-ఆగస్టు మధ్య కడప నుంచి కేవలం 2,373 మంది ప్రయాణిస్తే.. ఈ ఏడాది ఇదే సమయానికి ఏకంగా 11,962 మంది ప్రయాణించారు. అక్కడ విమాన ప్రయాణికుల వృద్ధి ఏకంగా 404 శాతం పెరిగింది. కేంద్ర పౌర విమానయాన శాఖ ‘ప్రాంతీయ విమాన సేవలు’ (ఉడాన్) పథకం కింద దేశంలో 70 విమానాశ్రయాలను కలుపుతూ తక్కువ ధరకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఈ పథకం కింద ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల నుంచి విమానాలు నడపడానికి ముందుకొచ్చే వైమానిక సంస్థలకు కేంద్రం రాయితీ ప్రకటించింది. ఈ పథకంలో భాగంగా కడప విమానాశ్రయాన్ని కూడా కేంద్రం ఎంపిక చేసింది. దాంతో అక్కడినుంచి ట్రూజెట్ సంస్థ రోజూ హైదరాబాద్‌కు విమానాలు నడుపుతోంది. అక్టోబరు నుంచి విజయవాడ, చెన్నైలకు కూడా ఇక్కడినుంచి విమానాలు నడపనుంది. విజయవాడ నుంచి జూమ్ ఎయిర్ సంస్థ దిల్లీ, విజయవాడ, ముంబయి, పుణే, సూరత్‌ల మధ్య విమాన సర్వీసులు నిర్వహించనుంది. విశాఖపట్నంనుంచి జగదల్పూర్ మధ్య ఎయిర్ ఒడిశా కూడా అక్టోబరు నుంచి సేవలు అందించనుంది. స్పైస్‌జెట్ ముంబయి, విజయవాడ, చెన్నై, బెంగళూరు, ముంబయిల మధ్య విమానాలు నడపడానికి ప్రయత్నిస్తోంది.
వచ్చే జూన్‌కు ఓర్వకల్లు
కర్నూలు జిల్లా ఓర్వకల్లులో వచ్చే ఏడాది జూన్‌కల్లా విమానాశ్రయాన్ని నిర్మించి విమానాలు నడపడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓర్వకల్లులో ప్రభుత్వ రంగ సంస్థ భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ సంస్థ (బీఐఏసీఎల్) పనులు చేపడుతోంది.
విశాఖపట్నం నుంచి..
విమాన సేవలు: విజయవాడ, ముంబయి, దిల్లీ, హైదరాబాద్, పోర్ట్‌బ్లెయిర్, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, భువనేశ్వర్, రాయ్‌పూర్, జగదల్పూర్, సింగపూర్, కౌలాలంపూర్, కొలంబో, తిరుపతి, అహ్మదాబాద్, అగర్తలా, కోయంబత్తూరు
విమాన సంస్థలు: జెట్ ఎయిర్వేస్, ఎయిరిండియా, ఎయిర్ఆసియా ఇండియా, అలయెన్స్ ఎయిర్, స్పైస్‌జెట్, ఇండిగో, ఎయిర్ ఆసియా, సిల్క్‌ఎయిర్ (సింగపూర్), శ్రీలంక ఎయిర్‌లైన్స్, ఎయిర్ ఒడిశా
విజయవాడ విమానాశ్రయం నుంచి..
విమాన సేవలు: దిల్లీ, విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై, తిరుపతి, పుదుచ్చేరి
విమాన సంస్థలు: ఎయిరిండియా, స్పైస్‌జెట్, అలయెన్స్ ఎయిర్, ట్రూజెట్
తిరుపతి నుంచి..
విమానసేవలు: విజయవాడ, హైదరాబాద్, దిల్లీ, విశాఖపట్నం, బెంగళూరు
విమాన సంస్థలు: ఎయిరిండియా, అలయెన్స్ ఎయిర్, స్పైస్‌జెట్, ట్రూజెట్
రాజమహేంద్రవరం నుంచి
విమాన సేవలు: చెన్నై, హైదరాబాద్, బెంగళూరు
విమాన సంస్థలు: జెట్ ఎయిర్వేస్, స్పైస్‌జెట్, ట్రూజెట్
కడప విమానాశ్రయం నుంచి..
విమాన సేవలు: హైదరాబాద్ (ఉడాన్ విమానాలు), చెన్నై, విజయవాడ (అక్టోబరు నుంచి ఆరంభం)
విమాన సంస్థలు: ట్రూజెట్, ఎయిర్ ఒడిశా













