ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సామాజిక సేవ.. ప్రభుత్వానికి పోటీగా కాదు
ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా సామాజిక సేవలో నావంతు పాత్ర పోషిస్తున్నా, ప్రభుత్వానికి పోటీగా కాదు అని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి పేర్కొన్నారు. ఇటీవల చిత్తూరు, కడప జిల్లాల్లో వర్షాలు, వరదల కారణంగా మృతి చెందిన 48 మంది కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున ఎన్టీఆర్ ట్రస్టు నుంచి చెక్కులను అందజేశారు. తిరుపతిలోని ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంకు ఆవరణలో జరిగిన ఈ కార్యక్రమంలో భువనేశ్వరి మాట్లాడుతూ ఆడపిల్లలంటే ఆట వస్తువులు కాదని, పనిలేక కొందరు తమపై విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం ఎవరికైనా మంచిది కాదన్నారు. సమాజానికి ఉపయోగంలేని విమర్శలు ఎందుకు? అన్నారు. వైకాపా నేతలు నాపై చేసిన విమర్శలను పట్టించుకోను బాధపడను. విమర్శలు చేసిన వారి విజ్ఞతకే వదిలేస్తున్నా అని స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు ఏవిధంగా అభివృద్ధి చేశారో నాకు తెలుసు అన్నారు. రాత్రింబవళ్లు నిద్ర లేకుండా పని చేసిన గొప్ప వ్యక్తి ఆయన. రాష్ట్ర రాజధానిగా అమరావతి మాత్రమే ఉండాలి, ఉంటుంది. నా భర్త పనితీరు ఏంటో ప్రజలకు తెలుసు అని అన్నారు. ఎన్టీఆర్ ట్రస్టు సీఈవో రాజేంద్ర కుమార్ మాట్లాడుతూ నెల్లూరు, చిత్తూరు, అనంతపురం జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో దాదాపు 40 వేల మందికి ఆహారం, వైద్యం, మందులు, తాగునీరు అందించినట్లు తెలిపారు.













