అమరావతిలో ఎన్టీఆర్ మ్యూజియం
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తెలుగు వారి జ్ఞాపకం పేరుతో స్వర్గీయ నందమూరి తారక రామారావు మ్యూజియంను నిర్మించాలని ఎన్టీఆర్ ట్రస్ట్ సంకల్పించిందని ట్రస్ట్ సిఈఓ టి.విష్ణువర్థన్ తెలిపారు. దీనిలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహాలను తయారు చేసేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ప్రతిభ కలిగిన శిల్ప కళాకారులకు అవకాశం ఇవ్వాలని ట్రస్ట్ భావిస్తోందని ఆయన ఒక ప్రకటనలో వెల్లడించారు. మ్యూజియం కోసం తారకరామారావు సినీ ప్రస్థానంలో పోషించిన ముఖ్యమైన పాత్రలకు సంబంధించిన లైఫ్ సైజ్ రియలిస్టిక్ శిల్పాలను ఫైబర్ మీడియంలో తయారు చేయాల్సి ఉంటుందని, పాత్రకి సంబంధించిన వస్తువులతో పాటు సహజ దుస్తులతో అలంకరించాలని తెలిపారు. ఆసక్తి ఉన్న వారు జూన్ 30లోపు తమ వివరాలను, గతంలో తయారు చేసిన సహజత్వం ఉట్టిపడే శిల్పాల ఫోటోలను తమ అడ్రస్‌కు పంపించాలని సూచించారు.













