ప్రజా సమస్యల పరిష్కారానికి ఓ యాప్ : టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం
టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహిస్తున్న గ్రీవెన్స్‌లో వచ్చే ఫిర్యాదులను వేగంగా పరిష్కరించేందుకు ఓ యాప్‌ను రూపొందిస్తున్నట్లు టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు తెలిపారు. తద్వారా ప్రజల్లో ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతోందని, రాబోయే ఎన్నికల్లో పార్టీకి మేలు చేకూరుతుందని వారు వివరించారు. రాష్ట్ర సచివాలయంలో టీడీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. 175 నియోజకవర్గాలకు అవసరమైన సమాచారాన్ని అందించాం. ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్ల తొలగింపుతో పాటు తప్పుల్లేని ఓటర్ల జాబితా రూపకల్పనను ఎన్నికల సంఘం అధికారులతో కలిసి పనిచేశాం. కూటమి అభ్యర్థుల విజయం కోసం 1.80 కోట్ల మందికి వాట్సప్ సందేశాలు పంపాం అని ఎన్ఆర్ఐ టెక్ బ్రెయిన్ పేరుతో గత ఎన్నికల్లో చేసిన కృషిని మంత్రికి వివరించారు. సొంత డబ్బు ఖర్చు పెట్టుకొని పార్టీ కోసం ఎన్ఆర్ఐలు ఎంతో కస్టపడ్డారని, వారి సేవలను మర్చిపోమని సత్యప్రసాద్ పేర్కొన్నారు. టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధులు 2029 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎన్ఆర్ఐ టీడీపీ విభాగం ప్రతినిధులు కిరణ్ తుమ్మల, సూర్య తెలప్రోలు, మురళీ కోగంటి. తేజ్ మన్నవ, వల్లభనేని నాగేశ్వరరావు, యలమంచలి వెంకట్, మనోజ్ లింగా పాల్గొన్నారు.













