తిరుమల శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు.. ప్రవాస భారతీయుడు భారీ విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి ఎస్వీబీసీ ట్రస్టుకు ప్రవాస భారతీయుడు రూ.4.20 కోట్ల విరాళం అందించారు. అమెరికాలోని బోస్టన్లో నివాసం ఉంటున్న ప్రవాస భారతీయులు రవి ఐకా తన ప్రతినిధి విజయవాడకు చెందిన రామకృష్ణ ప్రసాద్ ద్వారా విరాళం అందించారు. ఈ మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డిని కలిసి రామకృష్ణ ప్రసాద్ విరాళానికి సంబంధించిన డీడీలను అందజేశారు. ఈ సందర్భంగా ధర్మారెడ్డి మాట్లాడుతూ రవి ఐకా ఇప్పటికే పలు ట్రస్టులకు రూ.40 కోట్ల వరకు విరాళంగా అందించారని తెలిపారు. ఎస్వీబీసీలో కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాల కొనుగోలు కోసం రూ. 7 కోట్లు విరాళంగా ఇచ్చేందుకు రవి ఐకా ముందుకొచ్చారని తెలిపారు. తొలి విడతగా రూ.4.20 కోట్లు అందజేశారని తెలిపారు. ఎస్వీబీసీకి అవసరమైన స్టేట్ ఆఫ్ ఆర్ట్ కెమెరాలు, ఇతర సాంకేతిక పరికరాలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు.













