కనకదుర్గమ్మకు అట్లాంటా ఎన్నారై కనక పుష్యరాగ హారం విరాళం
విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నవరాత్రుల్లో అమ్మవారు తొమ్మిది రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఈ క్రమంలో కనకదుర్గ అమ్మవారి అలంకరణకు వాడే ఏడువారాల నగల్లో ఒకటైన 40 లక్షల రూపాయలు విలువైన కనకపుష్యరాగ హారాన్ని ఎన్నారై తాతినేని శ్రీనివాస్ దుర్గామాతకు సమర్పించారు. ఈ విషయాన్ని ఆలయ ఈవో సురేష్ బాబు తెలిపారు. ఈ హారాన్ని ప్రతి గురువారం అమ్మవారికి అలంకరించనున్నట్లు వెల్లడించారు. కనకపుష్యరాగాలు అన్ని ఒకే సైజు కోసం సింగపూర్ నుంచి తెప్పించామన్నారు. అలాగే గత 6 నెలల నుంచి అమ్మవారికి 7 వారాల నగలు అలంకరిస్తున్నామని, భక్తులు ఎవరైనా అమ్మవారికి 7 వారాల నగలు సమర్పించాలనుకుంటారో వారు దేవస్థానంలో సంప్రదించాలని తెలిపారు.
ఈ సందర్భంగా ఎన్నారై తాతినేని శ్రీనివాస్ మాట్లాడుతూ తాను విజయవాడ స్థానికుడిని అని, కానీ వృత్తిరీత్యా అట్లాంటాలో ఉంటున్నట్లు తెలిపారు. తమ కుమారుడు మొదటి జీతంతో అమ్మవారికి హారం అమ్మవారికి ఇవ్వటం చాలా ఆనందంగా ఉందన్నారు. అమ్మవారి హారం చేయించి ఇవ్వడం తమ పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.













