మూడు రాజధానులు కాదు..అమరావతిని అభివృద్ధి చేయడమే

మూడు రాజధానుల కంటే అమరావతిని అభివృద్ధి చేయడమే మేలని కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత శాఖ మంత్రి రామ్ దాస్ అథవాలే అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజధాని అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాల్సిందని అన్నారు. అప్పటి యూఏపీ ప్రభుత్వం ఈ అంశాలను విస్మరించిందని అన్నారు. ప్రస్తుతం అమరావతిలో అభివృద్ధి పనులు ఆగిపోయాయని వ్యాఖ్యానించారు.
మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తోందని అన్నారు. మూడు రాజధానులు నిర్మించడం కష్టసాధ్యమేనని అన్నారు. నిధులు లేకపోతే రాజధాని నిర్మాణం ఎలా కొనసాగుతుందని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు అంటోందని, ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి చెందడం లేదని అన్నారు. అలాంటప్పుడు 3 రాజధానుల అంశం సరికాదని సూచించారు. ఏ అంశానికైనా నిధులు ముఖ్యమని, నిధులు లేకే అమరావతి అభివృద్ధి చెందడం లేదని అన్నారు.