ఓటర్ల జాతర ఫినిష్.. ఇక ఓటరు కష్టాలు పట్టించుకునే నాథుడు లేడా?
ఎన్నికలకు ముందు హడావిడి చేసిన నేతలు ఎన్నికలు పూర్తయిన తర్వాత పూర్తి సైలెంట్ మోడ్ లోకి వెళ్లిపోయారు. మరి ముఖ్యంగా పెన్షన్ల విషయంలో మే ఒకటిన ఆంధ్రాలో జరిగిన రచ్చ ఏ రేంజ్ లో ఉందో అందరికీ తెలుసు. మే గడిచి జూన్ వచ్చింది.. అయితే ఇప్పుడు మాత్రం ఎక్కడ చూసినా మౌనం రాజ్యమేలుతోంది. నిన్న మొన్నటి వరకు వృద్ధులు, వికలాంగులు నిన్ను అవస్థలు పడుతున్నారని.. బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారని రాజకీయ విమర్శలు చెలరేగాయి.
ఇంటి వద్దకే వస్తున్న పెన్షన్లు ఆగిపోయి.. బ్యాంకుల చుట్టూ అగచాట్లు పడుతూ వృద్ధులు తిరగడానికి కారణం మీరంటే మీరు అని వైసీపీ.. టీడీపీ ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. మాట్లాడిన వారు అలాగే ఉన్నారు.. అయితే క్యాలెండర్ లో డేట్ మాత్రం మారింది.. అయితే ప్రజల కష్టాలలో ఎటువంటి మార్పు మాత్రం కనిపించడం లేదు. తమకు అందవలసిన పెన్షన్ కోసం మండే ఎండల్లో అవస్థలు పడుతూనే ఉన్నారు. అయితే తేడా మొత్తం రాజకీయ నాయకుల వైఖరిలోనే కనిపిస్తోంది.
అవ్వ తాతల ఆపద్బాంధవులం అని మాట్లాడిన ఒక్కరంటే ఒక్కరు ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియని పరిస్థితి. ఒక్కరు కూడా సోషల్ మీడియా వేదికగా పెన్షన్ కోసం అవస్థలు పడుతున్న వారికి సానుభూతి తెలపలేదు. ఎన్నికల ప్రక్రియ పూర్తయింది.. ఓటింగ్ జరిగిపోయింది.. ఇక ఓటర్ని ప్రసన్నం చేసుకోవాల్సిన అవసరం మాకు ఏంటి అన్నట్టు ఉంది వాళ్ళ వైఖరి.వాలంటీర్ల వ్యవస్థతో పెన్షన్ పంపిణీ ఆగిపోయాక జనసేన చేసిన రచ్చ అంత ఇంతా కాదు. అవ్వ తాతలకు.. వికలాంగులకు స్వచ్ఛందంగా సేవ చేయాలని చేదోడు వాదోడుగా నిలిచి వారికి సహకరించాలని జనసేనాని వారికి ఆదేశాలిచ్చారు. అయితే ఎన్నికల తర్వాత జనసైనికులు కాదు కదా ఏ పార్టీ నేతలు వీరి కష్టాలు పట్టించుకునే ఛాన్స్ కనిపించడం లేదు. ఓటర్ల జాతర పూర్తవడంతో.. పెన్షనర్లను పట్టించుకునే నాధుడే కనిపించడం లేదు.













