ఈ విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తించాలి : మంత్రి అంబటి
పోలవరం ప్రాజెక్టు కింద ఉన్న ముంపు ప్రాంతాలను ఆర్డినెన్స్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో కలిపారని, ఈ విషయాన్ని తెలంగాణ నేతలు గుర్తించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతి అంబటి రాంబాబు అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గోదావరికి భారీగా వరదలు వచ్చినా ప్రాణనష్టం జరగకుండా చూశామని అన్నారు. వరద బాధిత కుటుంబాలకు రూ.2 వేల చొప్పున చెల్లించామని తెలిపారు. తమ ప్రభుత్వం వచ్చాకే పోలవరం స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పూర్తి చేశామన్నారు. మంత్రిగా సాంకేతిక అంశాలు తెలియాల్సిన అవసరం లేదని అన్నారు. సాంకేతిక అంశాలు తెలియకపోయినా తనకు కామన్ సెన్స్ ఉందని వ్యాఖ్యానించారు.
దేశంలో ఆరోగ్యశాఖల మంత్రులు ఆస్పత్రుల్లో ఆపరేషన్లు చేస్తారా అని ప్రశ్నించారు. పోలవరం ఎత్తుతో తెలంగాణకు ఎలాంటి నష్టం లేదన్నారు. పోలవరం ప్రాజెక్టు జాప్యానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణమని కేంద్రం చెప్పిందన్నారు. అయితే దీనిలో టీడీపీ ఐదేళ్లు, వైసీపీ మూడేళ్లు అధికారంలో ఉన్నాయన్నారు. ఎక్కువ సమయం ఎవరు అధికారంలో ఉన్నారని ప్రశ్నించారు. కొత్త డీపీఆర్ ఆమోదం అంశం కేంద్రం వద్దే పెండింగ్‌లో ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇంకా రూ.2,700 కోట్లు ఆంధ్రప్రదేశ్‌కు రావాల్సి ఉందన్నారు.













