వైఎస్ జగన్, షర్మిల మధ్య ఎలాంటి విభేదాలు లేవు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సోదరి షర్మిల మధ్య ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవని వైకాపా సీనియర్ నేత, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తెలంగాణలో షర్మిల కొత్త పార్టీ నిర్ణయం నేపథ్యంలో తాడేపల్లిలోని వైకాపా కేంద్ర కార్యాలయంలో సజ్జల మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో వైకాపా వంటి పార్టీ ఉండాలని షర్మిల భావించి ఉండవచ్చు. వైకాపా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉండాలా? వద్దా? ఉంటే దానివల్ల పార్టీకి కలిగే లాభనష్టాలపై ముఖ్యమంత్రి జగన్కు సృష్టమైన అభిప్రాయం ఉంది. అయితే షర్మిల పార్టీ పెట్టాలని గత 2-3 నెలలుగా ప్రయత్నిస్తున్నారు అని అన్నారు.
కొత్తగా పార్టీని స్థాపించే అంశంపై షర్మిలకు అనేక విధాలుగా నచ్చజెప్పేందుకు ప్రయత్నించాం. కొత్తగా పార్టీ పెట్టడం వల్ల కలిగే నష్టాలను ఆమె వివరించాం. షర్మిల మా అందరి ఆత్మీయ సోదరి. తెలంగాణలో ఆమె సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. షర్మిలకు రాజకీయ నేపథ్యం ఉంది. అన్ని విధాలుగా ఆలోచింన తర్వాతే తెలంగాణలో పార్టీ పెట్టాలని భావించి ఉండొచ్చు. దాని వల్ల ఎదురయ్యే ఫలితాలు, పరిణామాలన్నింటినీ ఆమే ఎదుర్కొంటారు. ఇందులో కుటుంబసభ్యులు, వ్యక్తిగత విషయాలకు ఎలాంటి సంబంధం లేదు. ఆమెకు పదవి ఇవ్వడం జగన్కు చిన్న విషయం అని సృజ్జల సృష్టం చేశారు.













