5 రోజులు శ్రీవారి దర్శనం నిలిపివేత!
మహా సంప్రోక్షణ సందర్భంగా తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి దర్శనాన్ని ఐదు రోజుల పాటు పూర్తిగా నిలిపివేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ నెల 24న జరగనున్న దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశంలో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. శ్రీవారి ఆలయంలో అష్టబంధన బాలాలయ మహా సంప్రోక్షణకు ఆగస్టు 12 నుంచి 16 వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ముహూర్తం నిర్ణయించింది. 12 ఏళ్లకోసారి జరిగే ఈ మహా క్రతువు సందర్భంగా వైదిక కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడతారు. వైఖానస ఆగమ నిబంధనల మేరకు ఆ సమయంలో ఆలయ సిబ్బంది సైతం బంగారు వాకిలి దాటి లోపలికి వెళ్లే అవకాశం ఉండదు. గర్భాలయంలో మరమ్మతులనూ అర్చకులే చేస్తారు. ఈ కారణంగా శ్రీవారి దర్శనాన్ని గంటల తరబడి నిలిపివేయాల్సి ఉంటుంది.













