ఏపీ ఎప్పుడూ మాకు ప్రత్యేక రాష్ట్రమే : నితిన్ గడ్కరీ
రాజకీయాలను, అభివృద్ధిని కలిపి చూడవద్దని, రెండూ వేర్వేరూ అంశాలని కేంద్ర జల వనరులు, జాతీయ రహదారులు, నౌకయాన, శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పనితీరు బాగుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ కలిగిన నాయకుడని ప్రశంసించారు. రూ.6.688 కోట్ల విలువైన వివిధ జాతీయ రహదారుల ప్రాజెక్టులను విశాఖలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి గడ్కరీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో గడ్కరీ ప్రసంగించారు. ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ మాకు ప్రత్యేక రాష్ట్రమే. నవాంధ్ర అభివృద్ధికి పూర్తిగా సహకరిస్తాం. పోలవరం ప్రాజెక్టు జాతి సంపద. సివిల్ పనులన్నీ ఫిబ్రవరి నెలాఖరుకు పూర్తి చేయాలని ఆదేశించాం. గోదావరి నుంచి వృథాగా సముద్రంలో కలుస్తున్న 3 వేల టీఎంసీల నీటిని వినియోగించుకోవడానికి ప్రణాళిక రూపొందించాం అని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 70 శాతం సమస్యలన్నీ తన శాఖల పరిధిలోనే ఉన్నాయని, తప్పకుండా వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రధాని మోదీ కూడా ఏపీ అభివృద్ధినే కోరుకుంటున్నారని అన్నారు.













