కనకదుర్గ ష్లై ఓవర్ ప్రారంభం
విజయవాడకు మకుటాయామానంగా నిలవనున్న కనకదుర్గ ఫ్లై ఓవర్ ప్రారంభమైంది. వర్చువల్ విధానం ద్వారా కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, ఆంధప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దీన్ని లాంఛనంగా ప్రారంభించారు. దీనితో పాటు రాష్ట్రంలోని 9 జాతీయ రహదారుల ప్రాజెక్టులను జాతికి అంకితం చేయడంతో పాటు 16 వంతెనలకు గడ్కరీ శంకుస్థాపన చేశారు. అనంతరం రూ.15,592 కోట్లతో 61 కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే రూ.8,007 కోట్ల రూపాయలతో పూర్తైన 10 ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరీ, ముఖ్యమంత్రి వైఎస్ జగన్లు జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు వీకే సింగ్, కిషన్ రెడ్డి, మంత్రి శంకర్ నారాయణ, ఎంపీలు కేశినేని నాని, కనకమేడల రవీంద్రకుమార్; సీఎం రమేశ్ తదితరులు పాల్గొన్నారు.
2.6 కి.మీల పొడవున్న కనకదుర్గ ఫ్లైఓవర్ నిర్మాణాన్ని 2015లో ప్రారంభించారు. దీనికి మొత్తం రూ.502 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కేంద్రం వాటా రూ.355.8 కోట్లు కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.146.2 కోట్లు ఖర్చు చేసింది. 900 పనిదినాల్లో ఫ్లైఓవర్ నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఎలివేటెడ్ వంతెనలు సాధారణంగా నాలుగు వరసలే ఉంటాయి. కానీ కనకదుర్గ పైవంతెన ఆరు వరసలుగా నిర్మాణం చేయడంతో దక్షిణాదిలో తొలి ప్రాజెక్టుగా, దేశంలో మూడో ప్రాజెక్టుగా రికాక్డుకెక్కింది. తొలి రెండు ఆరు వరసల పైవంతెనలు ముంబయి, ఢిల్లీలో ఉన్నాయి.













