చావు కబురు చల్లగా..! విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటుకే..!!
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై వెనక్కు తగ్గేదే లేదని కేంద్ర ప్రభుత్వం కుండ బద్ధలు కొట్టేసింది. ప్లాంట్ ను ప్రైవేటీకరించడంలో వెనక్కు తగ్గే ప్రసక్తే లేదని తేల్చి చెప్పింది. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వంతో పాటు మిగిలిన పార్టీలన్నీ గొంతెత్తి అరుస్తున్నా కేంద్రం ఏమాత్రం పట్టించుకోలేదు. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఈ ప్లాంట్ తో ఏమీ సంబంధం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. దీనిపై ఇక రాద్ధాంతాలు ఆపాలని కూడా సూచించింది.
విశాఖ స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఎంత ఉద్యమం జరుగుతున్నా కేంద్రం మొదటి నుంచి ఒకే మాటపై ఉంది. తాము తీసుకున్న విధాన నిర్ణయాల్లో భాగంగా స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించాలని నిర్ణయించినట్లు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా.. పార్లమెంటు సాక్షిగా మరోసారి కేంద్రం ఇదే మాటను కుండబద్దలు కొట్టింది. లోక్ సభలో వైసీపీ ఎంపీలు ఎంవీవీ సత్యనారాయణ, గిడ్డి మాధవి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి కోసమే స్లీల్‌ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తున్నామంటూ ప్లాంట్ పై వెనక్కు తగ్గే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.
స్టీల్ ప్లాంట్ కు వ్యతిరేకంగా ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. అయినా.. తమకున్న 100శాతం పెట్టుబడులను ఉపసంహరించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు మంత్రి. జనవరి 27, 2021న సమావేశమైన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ దీనికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిందన్నారు. అంతేగాకుండా విశాఖ స్టీల్‌కు చెందిన ఇతర అనుబంధ సంస్థలు, భాగస్వామ్య సంస్థల నుంచి కూడా పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని తేల్చి చెప్పారు. పెట్టుబడుల ఉపసంహణ ద్వారా మూలధనాన్ని పూర్తిగా వినియోగించుకోవచ్చన్నారు. దీని వల్ల అధిక ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి, ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను ఎక్కువగా కల్పించవచ్చని వెల్లడించారు.
అయితే ప్రైవేటీకరణ ప్రక్రియలో ఉద్యోగులు, భాగస్వాముల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తామని మాటిచ్చారు. షేర్ పర్చేజ్ అగ్రిమెంట్లో ఇందుకు అవసరమైన షరతులను చేరుస్తామన్నారు. అంతేకాక.. ఉద్యోగులు, భాగస్వాములు షేర్లు కొనుగోలు చేసే విధంగా నిబంధనలు రూపొందిస్తామని చెప్పారు. అంతేకానీ ప్రైవేటీకరణ ప్రక్రియ మాత్రం ఆగదని తేల్చి చెప్పేశారు. మరోవైపు.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లో రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి వాటా లేదని తేల్చేసింది. అయినా.. ఏదైనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వ చొరవ అవసరమైనప్పుడు సంప్రదిస్తామని వెల్లడించింది.
స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరించబోతున్నారనే విషయం తెలిసినప్పుటి నుంచి విశాఖ భగ్గుమంటోంది. ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ కార్మికులు, ఉద్యోగులు ఉద్యమిస్తున్నారు. అయితే కేంద్రానికి మాత్రం ఒకటే మాట. విధానపరమైన నిర్ణయం తీసేసుకున్నామని, ఇప్పుడు ఉపసంహరించుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్తూ వచ్చారు బీజేపీ నేతలు. అంతేకాక.. ప్రభుత్వం ఉండేది పరిపాలించడానికే కానీ.. వ్యాపారాలు చేసేందుకు కాదని వెల్లడించింది. ఇప్పుడు అదేమాటను మరోసారి స్పష్టం చేసింది.













