చంద్రబాబుకు జైలులో రక్షణ లేదు : చినరాజప్ప
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ప్రాణాలకు జైలులో రక్షణ లేదని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. రాజమహేంద్రవరంలో చినరాజప్ప మీడియాతో మాట్లాడుతూ జైలు సూపరింటెండెంట్‌ను బదిలీ చేస్తున్నామంటూ వైసీపీ లీకులు ఇస్తోందని ఆయన మండిపడ్డారు. జైలును కూడా తమ కంట్రోల్లోకి తీసుకోవాలని జగన్ కుట్ర పన్నారని ఆరోపించారు. జైలు లోపలి అంశాలు ఎప్పటికప్పుడు సాక్షి, అనుబంధ మీడియాకు అందిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిణామాల పట్ల రాజ్యాంగ పెద్దలు జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైసీపీ హయాంలో పలుమార్లు చంద్రబాబు పర్యటనల్లో జరిగిన దాడులపై రాష్ట్ర పోలీసులు ఊదాసీనంగా వ్యవహరించారన్నారు.
గతంలో అమరావతి పర్యటనకు వెళ్లిన చంద్రబాబు బస్ మీద వైసీపీ మూకలు రాళ్ళు, చెప్పులతో దాడి చేస్తే దాన్ని ఆనాటి డీజీపీ గౌతమ్ సవాంగ్ నిరసన తెలపడంలో భాగమని, అది వారి భావ ప్రకటన స్వేచ్చ అని ప్రకటించారని మండిపడ్డారు. నందిగామ, యర్రగొండపాలెం పర్యటనల్లో చంద్రబాబు మీద జరిగిన రాళ్ల దాడి లో ఎన్ఎస్జీ కమాండోల తలకు గాయాలయ్యాయని గుర్తు చేశారు. రాష్ట్ర పోలీసులు పూర్తిస్థాయి నిర్లక్ష్యం పక్షపాత ధోరణి కళ్లకు కట్టినట్లు వాస్తవ పరిస్థితిని స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు.













