ఆ ముచ్చటా తీర్చేయండి..! నిమ్మగడ్డను వెంటాడుతున్న వైసీపీ..!!
ఏపీలో పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల పోరు ముగిసింది. అధికార వైసీపీ ఘన విజయం సాధించింది. ఆ పార్టీ శ్రేణులన్నీ ఫుల్ జోష్ లో ఉన్నాయి. ఈ ఎన్నికలను నిర్వహించొద్దంటూ మొదట్లో ఆ పార్టీ శ్రేణులు పెద్ద ఫైటే చేశాయి. కానీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పట్టుబట్టి వీటిని నిర్వహించారు. నిమ్మగడ్డ పైన ఉన్న అపనమ్మకంతో వైసీపీ శ్రేణులు ఈ ఎన్నికలు జరగకుండా ఉండేందుకు ఎన్ని చేయాలో అన్నీ చేశాయి. కోర్టు మెట్లెక్కాయి. కానీ కోర్టు ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అవి సాఫీగా సాగిపోయాయి.
ఇప్పుడు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. ఎలాంటి సిచ్యుయేషన్స్ ను అయినా ఫేస్ చేసేందుకు సిద్ధమైంది. అందుకే మిగిలిపోయిన పరిషత్ ఎన్నికలను కూడా నిర్వహించాలని పట్టుబడుతోంది. గతేడాదే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చింది. నామినేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది. చాలా చోట్ల ఏకగ్రీవాలు కూడా అయ్యాయి. అయితే కరోనా వల్ల ఆ ఎన్నికలు కూడా ఆగిపోయాయి. ఇప్పుడు పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలను పూర్తి చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం.. పరిషత్ ఎన్నికలను కూడా కంప్లీట్ చేసేస్తుందని అందరూ భావించారు. అయితే నిమ్మగడ్డ రమేశ్ కుమార్ మాత్రం ఈ ఎన్నికలను నిర్వహించేలా లేరు. ఈ నెలాఖరులో ఆయన రిటైర్డ్ అయిపోతున్నారు.
దీంతో.. ఇన్నాళ్లూ నిమ్మగడ్డ ఉండగా అసలే ఎన్నికలే జరగనివ్వకూడదనే ఉద్దేశంతో పనిచేసిన ప్రభుత్వం, వైసీపీ శ్రేణులు.. ఇప్పుడు మాత్రం పరిషత్ ఎన్నికలను కూడా నిమ్మగడ్డే నిర్వహించాలని పట్టుబడుతున్నాయి. ఆయన హస్తవాసి మంచిదని.. అందుకే వాటిని కూడా పూర్తి చేసివెళ్లాలని కోరుతున్నాయి. తాజాగా.. అంబటి రాంబాబు ఇదే విషయాన్ని ట్వీట్ చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. పరిషత్ ఎన్నికలు కూడా పూర్తయిపోతే పాలనపై పూర్తిగా దృష్టి పెట్టేందుకు వీలుంటుందని చెప్పారు. వాటిని నిర్వహించడానికి ఆరు రోజుల సమయం సరిపోతుందని.. వెంటనే ఆ తతంగం కూడా పూర్తి చేయాలని ఆయన నిమ్మగడ్డకు సూచించారు.
ఇప్పుడు పరిషత్ ఎన్నికలు నిర్వహించేందుకు నిమ్మగడ్డ సిద్ధంగా లేకపోయినా ప్రభుత్వం మాత్రం వీటికోసం పట్టుబడుతోంది. నాడు నిమ్మగడ్డను దుమ్మెత్తిపోసిన పెద్దలే ఇప్పుడు ఆయన వెంట పడుతున్నారు. తన జర్నీ సాఫీగా ముగిసిపోవాలనుకుంటున్న నిమ్మగడ్డ పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే విహార యాత్రకు వెళ్లాలని సెలవు కోరారు. కానీ ఆయన్ను సెలవులో పంపించకుండా ఉండేందుకు ప్రభుత్వం ఆటంకం కలిగంచే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రివిలేజ్ కమిటీ ద్వారా నోటీస్ ఇచ్చి .. విచారణకు అందుబాటులో ఉండాల్సిందిగా ఆదేశించింది. మరి నిమ్మగడ్డ లీవులో వెళ్తారా.. వెళ్లరా.. అనేది తెలియాల్సి ఉంది.













