సంచలనాల నిమ్మగడ్డ.. నేడే పదవీ విరమణ
నిమ్మగడ్డ రమేశ్ కుమార్ .. ఈ పేరు తెలియని తెలుగు వారుండరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా ఆయన చేసిన సంచలనాలు అన్నీఇన్నీ కావు. రాష్ట్రప్రభుత్వం ఢీ అంటే ఢీ అనే విధంగా ఆయన తలపడ్డారు. గతంలో ఏ ఎన్నికల కమిషనర్ చుట్టూ ఇన్ని వివాదాలు లేవు. ఎన్నికల సంఘాని, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన యుద్ధం అనేక సంచలనాలకు కారణమైంది. అయితే ఆ యుద్ధం ముగిసిపోతోంది. ఇవాళ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీ విరమణ చేయబోతున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ తో వైరం కొనసాగింది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్.. చంద్రబాబు మనిషి అని.. ఆయన చెప్పినట్లే నిమ్మగడ్డ నడుచుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే వీటిని పట్టించుకోని నిమ్మగడ్డ ఎన్నికల నిర్వహణకు ముందుకెళ్లారు. అయితే నిమ్మగడ్డ ఉండగా ఎన్నికలు నిర్వహించడం ఇష్టంలేని జగన్ ప్రభుత్వం అధికారులతో సహాయ నిరాకరణ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మొదలు ఉద్యోగ సంఘాల వరకూ ఎవరూ నిమ్మగడ్డను లెక్క చేయలేదు. ఆయన సమావేశాలకు హాజరు కాలేదు. దీంతో నిమ్మగడ్డ కోర్టు గడప తొక్కారు. ఎన్నికల సంఘం విధుల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరించిన కోర్టు.. SEC నిర్ణయమే ఫైనల్ అని తేల్చేసింది. పైగా ఎన్నికల సంఘానికి సహకరించాలని ప్రభుత్వాన్ని, అధికారులను ఆదేశించింది. దీంతో ప్రభుత్వం దిగిరాక తప్పదు.
కోర్టు ఆదేశాలతో అన్యమనస్కంగానే ప్రభుత్వం ఎన్నికలకు వెళాల్సి వచ్చింది. అయితే మంత్రులు, వైసీప నేతలు నిమ్మగడ్డపై విమర్శలు మాత్రం తగ్గించలేదు. దీంతో నిబంధనలు ఉల్లంఘించిన మంత్రులకు నిమ్మగడ్డ నోటీసులు ఇచ్చారు. మంత్రి పెద్దిరెడ్డి లాంటి వారిపై ఎన్నికల కోడ్ ను ప్రయోగించారు. దీంతో ప్రభుత్వం మరోసారి ఆగ్రహించాల్సి వచ్చింది. ఇరు వర్గాలూ కోర్టును ఆశ్రయించాయి. కోర్టుల్లో కేసులు కొనసాగుతుండగానే ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించింది. అయినా నిమ్మగడ్డతో వైరం మాత్రం కంటిన్యూ చేసింది.
నిమ్మగడ్డ ప్రతి అంశాన్ని కోర్టుకు లాగుతుండడంతో మంత్రులు కూడా నిమ్మగడ్డను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి లాగారు. తమ హక్కులకు భంగం కలిగించారంటూ మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ప్రివిలేజ్ కమిటీకి ఫిర్యాదు చేశారు. దీంతో నిమ్మగడ్డకు నోటీసులు అందించింది ప్రవిలేజ్ కమిటీ. ఎన్నికలు ముగిసిన తర్వాత సెలవులో వెళ్లాలనుకున్న నిమ్మగడ్డకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు ప్రతిబంధకంగా మారాయి. తాను ప్రివిలేజ్ కమిటీ పరిధిలోకి రానని నిమ్మగడ్డ లేఖ రాసారు. అయినా ప్రివిలేజ్ కమిటీ వెనక్కు తగ్గకపోవడంతో ప్రస్తుతం ఈ అంశం కోర్టులో ఉంది. కోర్టు ఎలాంటి తీర్పు చెప్తుందనేది ఆసక్తిగా మారింది.
అనేక సంచనాలు నిమ్మగడ్డ సొంతం. ప్రభుత్వంతో ప్రతిరోజూ ఢీకొన్నారాయన. అటు ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గకుండా నిమ్మగడ్డను కార్నర్ చేసింది. అయితే ఈ యుద్ధానికి ఇవాల్టితో ఫుల్ స్టాప్ పడబోతోంది. కొత్త ఎన్నికల కమిషనర్ గా మాజీ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని ఎంపికయ్యారు. రేపోమాపో ఆవిడ బాధ్యతలు చేపట్టబోతున్నారు. అయితే నిమ్మగడ్డ వేసిన కేసులు, నిమ్మగడ్డపై ప్రభుత్వం వేసిన కేసులు, ప్రివిలేజ్ కమిటీ నోటీసులు మాత్రం కంటిన్యూ కానున్నాయి. మరి అవి ఎలా ముగుస్తాయనేదే ఇప్పుడు ఆసక్తికరం.













