ప్రభుత్వ సహకారంతో ఎన్నికలు విజయవంతమయ్యాయి : నిమ్మగడ్డ
ఏపీలో ఎన్నికల నిర్వహణపై పూర్తి సంతృప్తితోనే ఉన్నానని ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా నిర్వహించామని, ప్రభుత్వ సహకారంతోనే అది సాధ్యమైందని ప్రకటించారు. నిమ్మగడ్డ పదవీ కాలం బుధవారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు.రీపోల్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం చాలా అరుదని, స్థానిక ఎన్నికలను కూడా సాధారణ ఎన్నికలుగా నిర్వహించామని చెప్పుకొచ్చారు. ఇదంతా కూడా ప్రభుత్వ సహాయ సహకారాలతోనే జరిగిందన్నారు. ఈ సందర్భంగా సీఎస్‌కు, ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన ధన్యవాదాలు ప్రకటించారు.
ఓటు హక్కుపై ఆసక్తికర వ్యాఖ్యలు
తన ఓటు హక్కు సాధనకై నిమ్మగడ్డ సంచలన ప్రకటన చేశారు. పదవీ విమరణ తర్వాత ఓ పౌరుడిగా తన హక్కు సాధించుకోడానికి వెనకాడనని, అవసరమైతే హైకోర్టుకు వెళ్లి, న్యాయపోరాటం చేస్తానని తేల్చి చెప్పారు. తెలంగాణలో తనకున్న ఓటు హక్కును రద్దు చేసుకొని, ఏపీలోని సొంత గ్రామంలో ఓరుగా ఉండాలని దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు. అది స్థానికంగా ఉండే ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి, జిల్లా అధికారి పరిధిలోని అంశమని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అంశం ఎంతమాత్రమూ కాదన్నారు. తన ఓటు హక్కు అప్పీలు జిల్లా కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉందని, దీన్ని టీ కప్పులో తుఫానుగా సృష్టించారని నిమ్మగడ్డ ఆక్షేపించారు. ‘‘ఓటు హక్కు ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? దీనికి వేరే కారణాలున్నాయని అనుకోవడం, ఇవన్నీ అపోహలకు దారితీస్తున్నాయి. వ్యవస్థల మధ్య అంతరాన్ని పెంచుతుంటాయి. ఇలాంటివి నేనెప్పుడూ కోరుకోవడం లేదు. కోరుకోను కూడా. నేను పదవిలో ఉన్నంత కాలం ఇలాంటి వ్యక్తిగత విషయాలు పట్టించుకోలేదు. పక్కన పెట్టా. పదవీ విరమణ తర్వాత ఓ పౌరుడిగా నా హక్కు సాధించుకోడానికి వెనుకాడను. అవసరమైతే హైకోర్టుకు వెళ్తా. న్యాయపోరాటం చేస్తా. దేశంలో ఓ వ్యక్తి ఎక్కడైనా ఓ చోట ఓటు వేసే హక్కు ఉంటుంది. రాజ్యాంగం కల్పించిన హక్కు అది. ఎవరూ కాదనలేరు.’’ అని నిమ్మగడ్డ వ్యాఖ్యానించారు.













