ఏపీలో నేటి నుంచి నైట్ కర్ఫ్యూ
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా వెలుగు చూస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలను తీసుకుంది. నిత్యం వేల సంఖ్యలో కేసులు బయటపడుతూ పాజిటివిటీ రేటు 13.80 శాతానికి చేరడంతో అప్రమత్తమైంది. వైరస్ కట్టడికి రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమల్లోకి తీసుకురావాలని నిర్ణయం తీసుకుంది. కొవిడ్ ఆంక్షలను కట్టుదిట్టం చేసి వ్యాప్తికి చెక్ పెట్టాలని పలు నిర్ణయాలు తీసుకుని అమలు చేసేందుకు కార్యాచరణ రూపొందించింది. దీనిలో భాగంగా నైట్ కర్ఫ్యూ అమల్లోకి రానుంది. ఇప్పటికే ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. అన్ని జిల్లాల్లో నైట్ కర్ఫ్యూను పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశాలు ఇచ్చింది. ప్రతి రోజు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు కొనసాగుతాయి. ఈ నెలాఖరు వరకు రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూను అమలు చేయనున్నారు. కొవిడ్ నిబంధనలతో పాటు నైట్ కర్ఫ్యూ ఆంక్షలను అతిక్రమించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.













