ఇలా చేస్తే సీఎస్ ను జైలుకు పంపుతాం : ఏపీకి ఎన్జీటీ హెచ్చరిక

రాయల సీమ ఎత్తిపోతల పథకం విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. తమ ఆదేశాలకు విరుద్ధంగా ఏమాత్రం నడుచుకున్నా, తమ సూచనలను బేఖాతర్ చేస్తూ ప్రాజెక్టులు పనులు నిర్వహించినా, పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది. ఏకంగా ఏపీ సీఎస్‌ను జైలుకు పంపుతామని తీవ్రంగా హెచ్చరించింది. ఎన్జీటీ ఆదేశాలను ఏపీ సర్కార్ ఉల్లంఘిస్తోందంటూ తెలంగాణకు చెందిన గవినోళంల శ్రీనివాస్ హైకోర్టులో ఏపీ ప్రభుత్వంపై ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఎన్జీటీ ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగానే ఏపీ వ్యవహార శైలిని తప్పుబట్టింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం తాజా పరిస్థితిపై తమకు నివేదిక సమర్పించాలని ప్రాంతీయ బోర్డులను కేంద్రం హరిత ట్రిబ్యునల్ ఆదేశించింది. శ్రీశైలం నుంచి రోజుకు 3 టీఎంసీలు తీసుకునేలా రూపొందించిన రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ముందుకెళ్లొద్దని గత సంవ్సరం ట్రిబ్యునల్ సూచించిందని, అయినా ఏపీ పనులు చేపడుతోందని పిటిషనర్ ట్రిబ్యునల్ దృష్టికి తీసుకెళ్లారు. రాయలసీమ ఎత్తిపోతల ద్వారా రోజుకు 8 టీఎంసీల చొప్పున, నెల రోజుల్లో దాదాపుగా 200 టీఎంసీలకు పైగానే తీసుకునేందుకు అవకాశం ఉంటుందని, దీనివల్ల తెలంగాణకు ఇబ్బందేనని తెలిపారు. రాయల సీమ ఎత్తిపోతలు వేగంగా జరుగుతున్నాయని, ఇలాగే కొనసాగితే మాత్రం తెలంగాణకు తీవ్ర నష్టం కలుగుతుందని పిటిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు.