ఏపీలో మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు
ఆంధ్రప్రదేశ్‌కు మరో ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు రానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డీఆర్డీవో (రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ) ఆధ్వర్యంలో అత్యాధునిక క్షిపణి పరీక్ష కేంద్రం ఏర్పాటుకానుంది. ఇందుకోసం కృష్ణా జిల్లాలోని నాగాయలంక మండలం గుల్లలమోద తీరంలో ఇప్పటికే ప్రభుత్వం 381 ఎకరాలను కేటాయించింది. ఈ స్థలంలో అటవీ ప్రాంతం ఉండడంతో అనుతుల విషయంలో జాప్యమైంది. ఆరేళ్ల నుంచి ఎదురవుతున్న అడ్డంకులు తొలగి ఎట్టకేలకు మొదటి దశ అనుమతులు ఇటీవల మంజూరయ్యారు. భూమి బదిలీ ప్రక్రియ వేగం పుంజుకుంది. రెవెన్యూ భూములకు సంబంధించిన పరిహారం ఖారారైంది. వచ్చే నెలలో తుది అనుమతులు రానున్నాయి. ఆనక రూ.1,200 కోట్లతో తొల దశ ప్రాజెక్టు నిర్మాణం మొదలుకానుంది. కీలకమైన ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి కార్యాలయం స్వయంగా పర్యవేక్షిస్తోంది. భవిష్యత్తులో ఇది దేశ ప్రధాన క్షిపణీ పరీక్ష వేదిక కానుంది.













