ఆంధ్రప్రదేశ్ లో మరో రాజకీయ పార్టీ… ఆ వెంటనే
సార్వత్రిక ఎన్నికలకు అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తమవుతున్న వేళ ఢిల్లీలో మరో రాజకీయ పార్టీ ఆవిర్భవించింది. సినీ నిర్మాత సత్యారెడ్డి తెలుగు సేన పేరుతో ఓ రాజకీయ పార్టీ స్థాపించారు. పార్టీ ఆవిర్భావ ప్రకటనను ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్లో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎదురుగా చేశారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్, తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల పాలన చూశారని, వారు మరో ప్రత్యామ్నాయం కోరుకుంటున్నారని సత్యారెడ్డి తెలిపారు. తెలుగు ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా తెలుగుసేన పనిచేస్తుందని వెల్లడించారు. ఆవిర్భవించిన వెంటనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టినట్టు ప్రకటించారు. స్టీల్ ప్లాంట్ కోసం భూములిచ్చిన రైతులకు ఇప్పటికే న్యాయం జరగలేదని, నిర్వాసిత కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి తిరిగి వెళ్లిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి తెలుగు ప్రజల సమస్యల పరిష్కారం కోసం పోరాడతామని సత్యారెడ్డి తెలిపారు.













