AP Volunteers: క్యాడర్..వాలంటీర్ల సమీకరణపై వైసీపీలో కొత్త చర్చ

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఎదుర్కొన్న ఘోర పరాజయం రాజకీయ వర్గాల్లో ఇంకా చర్చనీయాంశంగానే ఉంది. ఓటమికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధాన కారణంగా వాలంటీర్స్ అనే టాక్ ఉంది. జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) నేతృత్వంలోని ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను ఒక ప్రత్యేకమైన ప్రయోగంగా ప్రవేశపెట్టింది. ప్రతి వాలంటీర్‌కు నెలకు ఐదు వేల రూపాయల గౌరవ వేతనం ఇచ్చి పౌర సేవలతో ప్రజలకు దగ్గర చేశారు. ఈ విధానం ద్వారా ప్రజలతో నేరుగా కనెక్ట్ అవుతూ వైసీపీకి పెద్దగా ఉపయోగపడతారని నమ్మకం ఏర్పడింది.
జగనన్న వారదులుగా చెప్పబడే వాలంటీర్లు పరిస్థితి ఎన్నికల ముందు పూర్తిగా మారిపోయింది. కూటమి పది వేల రూపాయల గౌరవ వేతనం ఇస్తామని ప్రకటించడంతో అనేక మంది వాలంటీర్లు వారి వైపు మొగ్గు చూపారు. ఫలితంగా ఐదేళ్ల పాటు వైసీపీకి (YCP) సేవ చేసినా, చివర్లో పార్టీకి అనుకూలంగా కాకుండా ప్రత్యర్థుల పక్షాన పనిచేయడం వైసీపీకి పెద్ద దెబ్బగా మారింది. ఇది ప్రత్యక్షంగా ఓటమికి దారితీసిన అంశాలలో ఒకటిగా విశ్లేషకులు భావిస్తున్నారు.
మొత్తం రాష్ట్రంలో సుమారు 2.70 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. వీరిలో చాలామంది వైసీపీ అనుకూలులే అయినప్పటికీ అందరూ అలా కాకపోవడం గమనార్హం. పార్టీ సానుభూతిపరులుగా ఉన్న వాలంటీర్లను తిరిగి ఉపయోగించుకోవాలని కొంతమంది నాయకులు సూచిస్తున్నారు. ఎందుకంటే వారికి గ్రామ స్థాయి నుంచి ప్రజలతో నేరుగా పరిచయాలు ఉన్నాయి. పథకాల అమలులో కీలకంగా పనిచేసిన అనుభవం ఉంది. వారిని తిరిగి ఫీల్డ్‌లోకి దింపితే వైసీపీకి క్షేత్రస్థాయిలో బలం పెరుగుతుందని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థను కూటమి ప్రభుత్వం మోసం చేస్తే వైసిపి ఆదుకుంటుంది అన్న యాంగిల్ లో కూడా ప్రజల్లో సింపతి తెచ్చుకోవచ్చు అని వారు అభిప్రాయపడుతున్నారు.
అయితే ఈ ఆలోచనలపై పార్టీ అంతర్గతంగా కొంత సందేహం ఉంది. మొదట వాలంటీర్లను తీసుకొచ్చినప్పుడు నుంచే క్యాడర్‌లో ఒక రకమైన అసంతృప్తి నెలకొంది. తమ స్థానాలను వాలంటీర్లు ఆక్రమించారన్న భావన కొందరిలో బలంగా ఉంది. ఇప్పుడు వారికి మళ్లీ ప్రాధాన్యం ఇస్తే తప్పుడు సంకేతాలు వెళ్లిపోతాయనే ఆందోళన కూడా ఉంది.
భవిష్యత్తులో వైసీపీ మళ్లీ అధికారంలోకి వస్తే వాలంటీర్లను తిరిగి ప్రభుత్వ సేవల్లోకి తీసుకుంటారా అన్న ప్రశ్నకి ప్రస్తుతం సమాధానం లేదు . ఇది క్యాడర్‌లో ఆందోళన కలిగిస్తోంది. తమకున్న స్థానం తగ్గిపోతుందనే భయం సహజమని నాయకులే అంగీకరిస్తున్నారు. అందుకే పార్టీ అధినాయకత్వం ఈ సందేహాలను తొలగించే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మళ్లీ అధికారంలోకి వచ్చినా వాలంటీర్ వ్యవస్థను పునరుద్ధరించమని స్పష్టమైన భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందని పార్టీ లోపలే వాదనలు వినిపిస్తున్నాయి.మొత్తానికి, వాలంటీర్ల వ్యవస్థ ఒకప్పుడు వైసీపీకి బలంగా మారినా, చివర్లో అదే పెద్ద సమస్యగా నిలిచింది. ఇప్పుడు వారిని మళ్లీ పార్టీ పనిలో ఎలా ఉపయోగించుకోవాలి అన్న దానిపై వైసీపీ ఆలోచిస్తోంది. కానీ అది చేస్తున్నప్పుడు క్యాడర్‌లో అసంతృప్తి రాకుండా సమతౌల్యం పాటించడం తప్పనిసరి అవుతోంది.