వైసీపీ కంచు కోట నెల్లూరు బీటలు వారుతోందా..?
ఉమ్మడి నెల్లూరు జిల్లా లో ఎప్పటినుంచో వైసీపీకి తిరుగులేని రికార్డు ఉంది. 2014 ఏపీ విభజన తరువాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో నెల్లూరు నుంచి వైసీపీకి మంచి ఫలితాలు దక్కాయి. అందుకే నెల్లూరు వైసీపీ కంచుకోటగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ సారి నెల్లూరు లో జగన్ సర్కార్ కు సవాళ్లు తప్పదని విశ్లేషకులు అంచనా. నెల్లూరు లోని 10 అసెంబ్లీ నియోజకవర్గ స్థానాలలో పోటీ చాలా టఫ్ గా కనిపిస్తోంది. 2014లో జరిగిన ఎన్నికల్లో మొత్తం 10 అసెంబ్లీ స్థానాలలో వైసీపీ 7 స్థానాలు దక్కించుకుంది. ఆ తర్వాత జరిగిన 2019 ఎన్నికల్లో మొత్తం 10 స్థానాలు క్లీన్‌స్వీప్ చేసింది వైసీపీ. అయితే ఈ ఐదేళ్లలో పరిస్థితులు చాలా మారాయి. ఈసారి నెల్లూరులో వైసీపీ గెలుపు అంత ఈజీ కాదు. నెల్లూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ పై తీవ్ర వ్యతిరేకత కారణంగా జగన్, ఖలీల్ అహ్మద్‌ను అభ్యర్థిగా ప్రకటించారు. టీడీపీ నుంచి మాజీమంత్రి.. నారాయణ సంస్థల వ్యవస్థాపకుడు.. పొంగూరు నారాయణ బరిలోకి దిగారు. ఇటు వైసీపీ ఫైర్ బ్రాండ్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి టీడీపీ తరఫునుంచి బరిలో దిగుతున్నారు. మరోపక్క వైసీపీకి నెల్లూరులో ఆర్థికంగా ఎంతో అండగా నిలిచిన నెల్లూరి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సతీసమేతంగా పసుపు తీర్థం పుచ్చుకున్నారు. వీటన్నిటి మధ్య జరగబోయే ఎన్నికలలో వైసీపీ నెల్లూరులో పెద్ద సవాలే ఎదుర్కోబోతోంది అని అర్థం అవుతుంది. అందుకే జగన్ నెల్లూరు జిల్లా పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని టాక్.













