ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్ని
ఆంధప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా నీలం సాహ్ని బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు ఎస్ఈసీగా బాధ్యతలు నిర్వహించిన నిమ్మగడ్డ రమేశ్‌కుమార్ పదవీ కాలం మార్చి 31తో ముగిసిన విషయం తెలిసిందే. దీంతో నీలం సాహ్ని విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఏపీ తొలి మహిళా ఎస్ఈసీగా ఆమె గుర్తింపు పొందారు. కమిషన్ కార్యదర్శి కన్నబాబు, ఉద్యోగులు కొత్త ఎస్ఈసీకి అభినందనలు తెలిపారు. రాష్ట్రానికి కొత్త ఎన్నికల కమిషనర్ నియామకానికి సంబంధించి ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో కూడిన ప్యానల్‌ను రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కార్యాలయానికి పంపించగా.. నీలం సాహ్నిని ఎస్ఈసీగా నియమించేందుకు ఆమె పేరును గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ఖరారు చేశారు. ఎస్ఈసీగా తనను ఎంపిక చేసిన గవర్నర్‌కు ఈ సందర్భంగా నీలం సాహ్ని ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వ యంత్రాంగం, ప్రజల సహకారంతో పరిషత్ ఎన్నికలు పూర్తి చేస్తామని ఆమె వెల్లడించారు.













