ఏపీ కొత్త ఎస్ఈసీగా నీలం సాహ్ని ?
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం ఈ నెల 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ తదుపరి ఎస్ఈసీ ఎవరనేదానిపై చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారుల పేర్లను గవర్నర్‌కు సిఫారసు చేసినట్లు తెలుస్తోంది. ఏపీ మాజీ సీఎస్ నీలం సాహ్ని, ప్రేమ్‌చంద్రారెడ్డి, శామ్యూల్ పేర్లను గవర్నర్‌కు పంపినట్లు సమాచారం. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడినప్పటికీ కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. కొత్తగా బాధ్యతలు చేపట్టే ఎస్ఈసీ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రంలో రాజకీయాలు రసవత్తరంగా మారిన నేపథ్యంలో కొత్త ఎస్ఈసీ ఎవరనే అంశం ఆసక్తికరంగా మారింది.













