NCW: వేశ్యల రాజధాని కామెంట్స్ పై జాతీయ మహిళా కమిషన్ సీరియస్

అమరావతి మహిళలపై జర్నలిస్టు వాడపల్లి కృష్ణంరాజు (VVR Krishnam Raju) చేసిన అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహావేశాలకు దారితీశాయి. ఈ వ్యాఖ్యలను జాతీయ మహిళా కమిషన్ (NCW) సుమోటోగా స్వీకరించి, విచారణకు ఆదేశించింది. ఈ మేరకు జాతీయ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ విజయ రహత్కర్ ఆంధ్రప్రదేశ్ డీజీపీకి (AP DGP) లేఖ రాశారు. వెంటనే దర్యాప్తు చేపట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మూడు రోజుల్లోగా దర్యాప్తు వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని కమిషన్ స్పష్టం చేసింది. జర్నలిస్టు కృష్ణంరాజు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ, జాతీయ మహిళా కమిషన్ ఒక ప్రకటన విడుదల చేసింది. మీడియా కథనాలన్నింటినీ సుమోటోగా పరిగణనలోకి తీసుకున్నట్లు కమిషన్ వెల్లడించింది. ఈ వ్యాఖ్యలు మహిళల గౌరవాన్ని కించపరిచేలా ఉన్నాయని, వీటిపై తక్షణ చర్యలు అవసరమని కమిషన్ పేర్కొంది.
గత శనివారం ఓ మీడియా ఛానల్‌లో ప్రసారమైన ఒక చర్చా కార్యక్రమంతో ఈ వివాదం మొదలైంది. ఈ కార్యక్రమంలో ఎనలిస్టుగా పాల్గొన్న జర్నలిస్టు కృష్ణంరాజు అమరావతి (Amaravati) మహిళలను ఉద్దేశించి, “అమరావతి వేశ్యల రాజధాని, అక్కడ సెక్స్ వర్కర్లు (Sex Workers) ఎక్కువగా ఉంటారు” అని వ్యాఖ్యానించారు. ఈ చర్చను సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాసరావు (Kommineni Srinivasa Rao) నిర్వహించారు. ఆయన ఈ వ్యాఖ్యలను అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో ఈ వ్యాఖ్యలను వైరల్ గా మారాయి. తీవ్ర విమర్శలకు దారితీశాయి. అమరావతి రైతులు, మహిళా సంఘాలు, రాజకీయ నాయకులు ఈ వ్యాఖ్యలను ఖండిస్తూ నిరసనలు తెలిపారు. రాజధాని దళిత మహిళలు రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజను కలిసి వినతిపత్రం సమర్పించారు. కృష్ణంరాజు, కొమ్మినేనిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. రాష్ట్ర మహిళా కమిషన్ ఈ ఘటనపై సుమోటోగా కేసు నమోదు చేసి, ఇద్దరికీ నోటీసులు జారీ చేసింది.
ఈ ఘటనపై రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. అమరావతి రైతులు, మహిళా సంఘాలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు జాతీయ మహిళా కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ (NHRC), ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు లేఖలు రాశారు. కృష్ణంరాజు, కొమ్మినేనిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
మరోవైపు… విజయవాడ పోలీసులు కృష్ణంరాజు, కొమ్మినేని శ్రీనివాసరావులపై కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్లు 294, 354ఏ, 500, 504, 505(2), 509 కింద కేసులు దాఖలు చేశారు. కొమ్మినేని శ్రీనివాసరావును పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి విజయవాడ తరలించారు. ఆయనకు గుంటూరు కోర్డు 14 రోజుల రిమాండ్ విధించింది. అయితే.. ఈ కామెంట్స్ చేసిన జర్నలిస్టు కృష్ణంరాజు పరారీలో ఉన్నారు. ఆయనకోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఈ వ్యాఖ్యలపై రాజకీయ విమర్శలు కూడా తీవ్రమయ్యాయి. మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్.. కృష్ణంరాజును పేరోల్ జర్నలిస్టుగా అభివర్ణించారు. గతంలో ఆయన అంబేడ్కర్‌పై చేసిన వ్యాఖ్యలను కూడా గుర్తు చేశారు. అమరావతి మహిళా జేఏసీ సభ్యురాలు సుంకర పద్మశ్రీ.. సంబంధిత మీడియాతో పాటు కృష్ణంరాజు, కొమ్మినేని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వివాదం రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక చర్చగా మారింది. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు స్పందించడంతో దర్యాప్తు వేగవంతం కానుంది.