మా రాష్ట్రానికి రండి… అన్ని వసతలు కల్పిస్తాం
నవ్యాంధ్రకు తరలిరండి మీకు ఎలాంటి సహకారమైన అందిస్తాం అని టెక్స్టైల్స్ పరిశ్రమలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంతాల్లో టెక్స్టైల్స్ పార్కుల ఏర్పాటుకు వీలుగా మౌలిక వసతులను కల్పిస్తామన్నారు. గుజరాత్ రాజధాని అహ్మదాబాద్లో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీతో కలిసి టెక్స్టైల్స్ ఇండియా-2017 జాతీయ స్థాయి ప్రదర్శన, సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ వస్త్ర పరిశ్రమకు సంబంధించి నిపుణులైన మానవ వనరులు పుష్కలంగా ఉన్న ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మా రాష్ట్రంలో పెట్టుబడులకు మంచి వాతావరణం ఉంది. అవసరమైన మద్దతు ఇవ్వడానికి మంచి అధికారుల బృందం ఉంది. నేను కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలు పరిష్కరిస్తాను అని అన్నారు.
మోదీకి సీఎం చంద్రబాబు ఆహ్వానం
కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేసిన ప్రపంచంలోనే అతిపెద్దదైన 1000 మెగావాట్ల సౌర విద్యుత్తు పార్కును సందర్శించాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. దీనిపై ప్రత్యేకంగా లేఖ రాశారు. గడివేముల మండలం గని, ఓర్వకల్లు మండలంలోని సఖినాల గ్రామాల్లోని 5691 ఎకరాల్లోని సోలారు పార్కును ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రధాని రాకతో ఈ సోలార్ పార్కుకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని అధికారులు భావిస్తున్నారు.













